సీఎం ఇలాకాలో  తెగని భూ పంచాయితీ!

సీఎం ఇలాకాలో  తెగని భూ పంచాయితీ!
  • గొల్లపల్లిలోని సర్వే నంబర్​ 101లో 110 ఎకరాల భూమిపై గందరగోళం
  • 50 ఏండ్ల కింద పట్టాలిచ్చి హద్దులు చూపకపోవడంతోనే సమస్య
  •  సర్కారు ఇచ్చే సాయం పొందలేకపోతున్న రైతులు 
  • ఎన్నికల బహిష్కరణకు సిద్ధమవుతున్న  బాధితులు 

సిద్దిపేట/జగదేవ్ పూర్, వెలుగు : సీఎం కేసీఆర్ ఇలాకాలో భూ పంచాయతీ తెగట్లేదు. ఏండ్ల తరబడి నానుతున్న సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఆ రైతులు పొందలేకపోతున్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని జగదేవ్ పూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని 101 సర్వే నంబరులో 110 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 50 ఏండ్ల కింద గ్రామంలోని అన్ని వర్గాలకు చెందిన 120 మందికి అందులో నుంచి 74.25 ఎకరాలను పంపిణీ చేశారు.

ఒక్కో రైతుకు  20 గుంటల నుంచి ఎకరం వరకు పంచి పట్టా పాస్ బుక్కులను అప్పగించారు. మరో 35.15 ఎకరాల భూమి మిగిలింది.  ఇదే సమయంలో పట్టాలిచ్చిన అధికారులు లబ్ధిదారులకు సరైన విధంగా హద్దులు చూపకపోవడం సమస్యకు దారితీసింది.

 సిబ్బంది చేతి వాటంతో సమస్య జఠిలం

రైతులకు పంపిణీ చేయగా మిగిలిన 35.15 ఎకరాల భూమితో అక్రమాలకు తెరలేచింది. కొందరు రెవెన్యూ సిబ్బందికి మామూళ్లు ముట్టజెప్పి ఈ భూమిలో నుంచి ఒక్కొక్కరు ఎకరం నుంచి రెండెకరాల మేర వారి పహాణిల్లో ఎక్కించుకోగా కొందరు లబ్ధిదారులు  సాదాబైనామాలతో తమ  భూములను అమ్ముకున్నారు. ఇదే సమయంలో  రెవెన్యూ సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించి  కొత్తగా సాదాబైనామాలతో కొనుగోలు చేసిన వారి  పేర్లను పహాణిల్లో నమోదు చేశారు. ఇదిలా ఉండగా 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా పేదలకు భూములు పంపిణీ చేయగా ఇదే సర్వే నంబరులో కొందరికి భూమిని కేటాయించి పోజిషన్ చూపలేదు.

దీంతో ఆ సర్వే నంబరులో రికార్డుల్లో ఉన్న వారు పొజిషన్ లో లేకపోవడం, పొజిషన్ లో ఉన్న వారు రికార్డుల్లో లేకపోవడంతో పాటు భూమిని అమ్ముకున్న వారితో పాటు కొనుగోలు చేసిన వారి పేర్లు పహాణిల్లోకి ఎక్కడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ప్రైవేటు సర్వేయర్ తో భూమిని సర్వే చేయిస్తే రికార్డుల ప్రకారం 101 సర్వే నంబరులో భూ విస్తీర్ణం 110 ఎకరాలకు బదులు 115  ఎకరాలు రావడంతో  సమస్య మరింత జఠిలమైంది.

ALSO READ :ట్రైకార్ యూనిట్లు గ్రౌండింగ్ ​చేస్తలే.. మూడేండ్లుగా 191 మంది ఆదివాసీలకే లబ్ధి

రైతుబంధుకు దూరం

గొల్లపల్లి 101 సర్వే నంబరులో 120 మంది రైతులుంటే వారిలో అత్యధిక మందికి రైతుబంధు అందడం లేదు. రికార్డుల ప్రకారం సర్వే నంబరులో ఉన్న 110 ఎకరాల కంటే ఎక్కువ  విస్తీర్ణం చూపుతుండటంతో ధరణిలో నమోదు కాలేదని తెలుస్తోంది. దీంతో మెజార్టీ రైతులకు రైతుబంధు అందకుండా పోతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం కొంత కాలంగా రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 

ఎన్నికల బహిష్కరణకు నిర్ణయం!

ఏండ్ల తరబడి సాగుతున్న ఈ భూ సమస్యను పరిష్కరించకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని బాధిత రైతులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రైతులు ఏకంగా కలెక్టరేట్​లోనే వినతి పత్రం ఇచ్చారు. అయినా సర్వే  ప్రారంభించడం లేదు. పూర్తి స్థాయి సర్వేతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, అధికారులు వెంటనే స్పందించి రికార్డుల ప్రకారం పోజిషన్ లో ఉన్న వారిని గుర్తించి పట్టా పాస్ బుక్కులు జారీ చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

రైతుబంధు రావట్లే.. 

గొల్లపల్లిలోని 101 సర్వే నంబరులో నాకు 20 గుంటల భూమి ఉంది. కానీ ఇప్పటి వరకు రైతుబంధు రాలేదు. 50 ఏండ్ల కింద సర్కారు మా తాతకు ఇచ్చిన భూమిని నాపేరిట పట్టా చేసుకున్నాను. నా పేరుతో పాస్ బుక్కులు కూడా ఉన్నా  టెక్నికల్ సమస్య పేరిట రైతుబంధు ఇస్తలేరు. త్వరగా పరిష్కారం చూపాలి. 

– అక్కరాజు వెంకటస్వామి, రైతు గొల్లపల్లి

సమస్య పరిష్కారానికి చర్యలు

గొల్లపల్లిలోని 101 సర్వే నంబర్ లోని భూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూ సిబ్బంది 58, 59 ఇండ్ల రెగ్యులరైజేషన్ పనుల్లో బీజీగా ఉండటంతో ఆలస్యమవుతోంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఆ భూమిని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తాం. ఎవరూ ఆందోళన చెందొద్దు. 

– రఘువీరా రెడ్డి, తహసీల్దార్, జగదేవ్ పూర్