- ప్రభుత్వానికి నివేదిక భర్తీ చేయాలని ఉద్యోగుల వినతి
- ఉద్యోగుల కొరతతో సిబ్బందిపై అదనపు భారం
హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలోని ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిబ్బంది కొరత ఉండడంతో ఏండ్లుగా ఫైల్స్ పెండింగ్లో ఉంటున్నాయి. దాదాపు 111 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇందులో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో 77, ఇంజినీరింగ్ విభాగంలో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కింద (అడ్మినిస్ర్టేషన్ విభాగం) మొత్తం 209 మంది ఉద్యోగులు అవసరం కాగా.. ప్రస్తుతం 126 మంది మాత్రమే ఉన్నారు. ఉద్యోగుల కొరతపై గతంలోనే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. టీజీపీఎస్సీ ద్వారా 14 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను గ్రూప్-3 కింద 2022లో నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిసింది. కానీ, ఈ పోస్టులు ఇంకా భర్తీ కాలేదు.
టీజీపీఎస్సీకి ఖాళీల వివరాలు అందజేత!
దేవాదాయ శాఖ అధికారులు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల వివరాలను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. టీజీపీఎస్సీకి కూడా ఆ వివరాలను పంపినట్లు సమాచారం. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 4, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు 5, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రూప్-3 కింద 54, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 14 ఖాళీగా ఉన్నాయి. ఇంజినీరింగ్ విభాగంలోనూ 34 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
ఎస్ఈ, ఏఈ, డీఈ, డ్రాఫ్ట్ మెన్, ట్రెజరర్ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి అధికారులు అందజేసినట్లు సమాచారం. ఉద్యోగుల కొరత ఉండటంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం స్పందించి ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని పలువురు ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దేవాదాయ శాఖపై దృష్టి సారించి ఖాళీలను భర్తీ చేయాలని కోరుతున్నారు.
ఫైల్స్ కదలని దుస్థితి
దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతున్నది. దాంతో ఫైల్స్ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. డిప్యూటేషన్ పై వచ్చినవారు పనిపై శ్రద్ధచూపడం లేదని తెలిసింది. ఎవరైనా కార్యాలయానికి వచ్చి సమాచారం అడిగినా స్పందించడం లేదని అధికారులే చెబుతున్నారు. కొంతమంది ఉద్యోగులు సమయానికి ఆఫీసుకు రావడం లేదు. మరికొందరు మధాహ్నం వచ్చి హాజరు వేసుకొని వెళ్తున్నారు. దీంతో ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి, ఇతరత్రా పనుల ఫైల్స్ ముందుకు కదలడం లేదు.