114 ఆవు దూడల అక్రమ తరలింపు

  • సూర్యాపేట జిల్లా  శాంతినగర్ వద్ద పట్టివేత

కోదాడ, వెలుగు : ఏపీలోని హనుమాన్ జంక్షన్ నుంచి డీసీఏంలల్లో అక్రమంగా తరలిస్తున్న114 ఆవు దూడలను ఆదివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..హనుమాన్ జంక్షన్ నుంచి 2 డీసీఏంలు, ఒక టాటాఏస్ లో 114 ఆవు దూడలను  అక్రమంగా హైదరాబాద్ తరలిస్తున్నారు. మార్గమధ్యలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఒక దూడను ఎక్కించుకొని హైదరాబాద్ వెళ్తున్నారు.

శాంతినగర్ సమీపంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా మూడు వాహనాల్లో దూడలు  కనిపించాయి. దీంతో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దూడలను హైదారాబాద్, మఠంపల్లిలోని గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.