ఆర్టీసీకి సంక్రాంతి కాసుల పంట.. రూ.115 కోట్ల ఆదాయం.!

ఆర్టీసీకి  సంక్రాంతి కాసుల పంట.. రూ.115 కోట్ల ఆదాయం.!
  • గతేడాదితో పోల్చితే 16 కోట్ల వరకు అదనం 

హైదరాబాద్, వెలుగు: టీజీఎస్​ఆర్టీసీకి సంక్రాంతి కాసుల వర్షం కురిపించింది. ఈ పండగకు ఆర్టీసీ నడిపిన దాదాపు ఆరు వేల ప్రత్యేక బస్సుల్లో ఆరు లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. అనాధికారిక లెక్కల ప్రకారం దాదాపుగా రూ.115 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు. గత ఏడాది సంక్రాంతికి ఐదు వేల వరకు ప్రత్యేక బస్సులు నడపగా అప్పుడు రూ.99 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని అంటున్నారు. 

గతేడాది సంక్రాంతి పండగ ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది దాదాపుగా రూ.16 కోట్లు అదనంగా వచ్చినట్లు చెప్తున్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు పండుగకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ.. తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ నెల 19, 20 తేదీల్లోనూ ప్రత్యేక బస్సులు నడిపింది. మొత్తం ఈ ఐదు రోజుల్లో నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా 50 శాతం పెంచిన అదనపు చార్జీలతో కలిపి మొత్తం రూ.115 కోట్ల వరకు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఒకటి ,రెండు రోజల్లో అధికారికంగా ఈ ఆదాయాన్ని ప్రకటించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.