మాస్కో టెర్రర్ దాడిలో..115 మంది మృతి

  •     200 మందికి పైగా గాయాలు
  •     భారీగా పెరిగిన మరణాల సంఖ్య
  •     రష్యా సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడి
  •     ఆర్మీ దుస్తుల్లో వచ్చి గ్రనేడ్లు, గన్స్​తో కాల్పులు

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్‌‌ సిటీ కాన్సర్ట్‌‌ హాల్​పై జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 115 కి చేరింది. ఈ ఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారని రష్యా సెక్యూరిటీ ఏజెన్సీ ఎఫ్ఎస్​బీ శనివారం ప్రకటించింది. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 

క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌‌లో షాపింగ్ మాల్​తో పాటు మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహించేలా పెద్ద ఆడిటోరియం కూడా ఉంది. ఇందులో మొత్తం 6,200 మంది కూర్చోవచ్చు. రష్యన్ రాక్ బ్యాండ్ ‘పిక్నిక్’ ప్రదర్శనకు శుక్రవారం పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే టెర్రరిస్టులు హాల్​లోకి చొరబడి.. గ్రనేడ్​లు విసురుతూ గన్స్​తో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 

దీంతో హాల్ పైకప్పు కూలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ఎఫ్ఎస్​బీ అధికారులు తెలిపారు. కొంతమంది మంటల్లో సజీవదహనం కాగా, మరికొందరిని టెర్రరిస్టులు పాయింట్ బ్లాంక్​లో గన్ పెట్టి కాల్చినట్టు తెలుస్తోందన్నారు. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ప్రభుత్వం ఆరోపించింది. 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నట్టు వివరించారు.

గ్రనేడ్లు విసురుతూ.. కాల్పులు

టెర్రరిస్టులు.. ఆర్మీ డ్రెస్​లో హాల్​లోకి చొరబడినట్టు రష్యన్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు తెలిపారు. ఆ వెంటనే విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూనే.. గ్రనేడ్లు విసిరారు. దీంతో హాల్ మొత్తం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది. దీంతో జనం ప్రాణాలు కాపాడుకునేందుకు భయంతో ఎగ్జిట్ డోర్ వైపు పరుగులు పెట్టారు. మరికొందరు సీట్ల వెనుకాల దాక్కునేందుకు ప్రయత్నించారు. కొంత మంది అభిమానులు ప్రాణాలు దక్కించుకునేందుకు పై ఫ్లోర్​కు పారిపోయారు.

దాడి చేసింది ఉక్రెయినే.. : రష్యా

రష్యా స్పెషల్ ఫోర్స్, పోలీసుల రాకను గమనించిన టెర్రరిస్టులు కారులో పారిపోయేందుకు ప్రయత్నించారని, ఛేజ్ చేసి పట్టుకున్నామని అధికారులు తెలిపారు. మొత్తం 11 మంది అనుమానితులు తమ అదుపులో ఉన్నారని చెప్పారు. వీరంతా ఉక్రెయిన్ వైపు పారిపోతుండగా పట్టుకున్నామన్నారు. అనుమానితుల్లో కొందరు దాడికి ముందు, ఆ తర్వాత ఉక్రెయిన్​లో ఉన్నవారితో మాట్లాడారని చెప్పారు. గడిచిన 20 ఏండ్లల్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి అని చెప్పారు. ఈ అటాక్ వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని ఆరోపించారు.

మమ్మల్ని బద్నాం చేస్తున్నరు: ఉక్రెయిన్

టెర్రర్ అటాక్​తో తమకేం సంబంధంలేదని ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా కావాలనే తమను బద్నాం చేస్తున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడోల్యాక్ తెలిపారు. తాము మాస్కోపై దాడి చేయలేదని స్పష్టం చేశారు. అలాంటి ఆలోచన కూడా లేదని తెలిపారు. రష్యాతో తాము ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నామని, యుద్ధభూమిలోనే తేల్చుకుంటున్నామని చెప్పారు.

అటాక్ మేమే చేశాం: ఐఎస్

మాస్కోలోని క్రాకస్‌‌ సిటీ కాన్సర్ట్‌‌ హాల్​పై దాడికి పాల్పడింది తామే అని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రకటించింది. ‘‘మా యోధులు.. మాస్కో శివారులో పెద్ద ఎత్తున దాడి చేశారు. అటాక్ చేశాక మా వాళ్లంతా సేఫ్​గా బేస్​కు తిరిగి వచ్చేశారు. క్రిస్టియన్లే లక్ష్యంగా దాడి చేశాం’’ అని టెలిగ్రామ్​లో ఐఎస్ ప్రకటించింది.

మా హెచ్చరికలు లైట్ తీసుకున్నరు: అమెరికా

టెర్రరిస్టులు దాడికి ప్లాన్ చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని రష్యన్ సెక్యూరిటీ ఏజెన్సీలకు ముందే సమాచారం ఇచ్చామని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అలర్ట్​గా ఉండాల్సిందిగా సూచించామన్నారు. ‘‘ఆఫ్గానిస్తాన్​లోని ఓ టెర్రరిస్ట్ గ్రూప్ మాస్కోలో దాడికి ప్లాన్ చేస్తున్నదని నెల రోజుల ముందే రష్యాకు చెప్పాం. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం చేకూర్చడమే టెర్రరిస్టుల లక్ష్యమని కూడా వివరించాం. మాస్కోలోని రద్దీ ప్రాంతం, షాపింగ్ మాల్, హాస్పిటల్, హాళ్లను టార్గెట్ చేసే అవకాశం ఉందని తెలియజేశాం. అలర్ట్​గా ఉండాల్సిందిగా హెచ్చరించాం. అయినా, రష్యన్ సెక్యూరిటీ ఏజెన్సీలు పట్టించుకోలేదు’’అని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.

రష్యాకు అండగా ఉంటాం: మోదీ

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ టెర్రరిస్ట్ అటాక్​పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. క్రాకస్‌‌ సిటీ కాన్సర్ట్‌‌ హాల్​పై ఐసిస్‌‌ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాల్పడిన ఘాతుకాన్ని ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. రష్యాకు, అక్కడి ప్రజలకు ఇండియా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘‘బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా ఆలోచనలు, ప్రార్థనలు ఎప్పటికీ వారి కోసం ఉంటాయి. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తాం. కలిసికట్టుగా టెర్రరిజాన్ని అంతం చేస్తాం’’ అని మోదీ ట్వీట్ చేశారు.

దాడి అనాగరికం: పుతిన్‌‌

కన్సర్ట్‌‌ హాల్‌‌లో శుక్రవారం జరిగిన టెర్రర్‌‌‌‌ దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌‌‌‌ పుతిన్‌‌ స్పందించారు. ఇది అనాగరిక చర్య అని మండి పడ్డారు. శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి ఓ టీవీ చానల్‌‌తో ఆయన మాట్లాడారు. ‘‘కన్సర్ట్‌‌పై దాడి బ్లడీ, బార్బెరిక్‌‌ టెర్రరిస్ట్ చర్య. ఈ దాడిలో డజన్ల కొద్దీ అమాయకు లు బాధితుయ్యారు. మార్చి 24ను జాతీయ సంతాప దినంగా ప్రకటిస్తున్నా” అని పేర్కొన్నారు.