యూపీలో తొక్కిసలాట.. 116 మంది మృతి

యూపీలో తొక్కిసలాట.. 116 మంది మృతి
  • హత్రాస్​లో జరిగిన సత్సంగ్​లో ఘోరం 
  • మృతుల్లో ఏడుగురు చిన్నారులు.. 108 మంది మహిళలు 
  • వందలాది మందికి గాయాలు.. భోలే బాబా సత్సంగ్​లో విషాదం 
  • వేదిక నుంచి భక్తులంతా ఒక్కసారిగా బయటకు పరుగులు 
  • ఒకే గేటు ఉండటంతో తీవ్రమైన రద్దీతో తొక్కిసలాట  
  • పదుల సంఖ్యలో జనం ఊపిరాడక మృతి
  • మృతుల ఫ్యామిలీలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా

హత్రాస్ (యూపీ): ఉత్తరప్రదేశ్​లో ఘోర విషాదం చోటు చేసుకుంది. వేలాది మంది హాజరైన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్రమైన రద్దీ కారణంగా తొక్కిసలాట జరగడంతో 116 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, 108 మంది మహిళలు ఉన్నారు. వందలాది మంది భక్తులు గాయపడ్డారు. మంగళవారం యూపీలోని హత్రాస్ జిల్లా ఫూల్ రాయ్ గ్రామం వద్ద నిర్వహించిన భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఈ పెను విషాదం జరిగింది. వందకుపైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘటనకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి.

కార్యక్రమం ముగిసిన వెంటనే బాబా వెళ్లిపోతుండగా ఆయనతో ఫొటో దిగేందుకు, బాబా కాళ్లు మొక్కేందుకు జనం ఎగబడ్డారని, బురద నేలపై కొందరు జారిపడటంతో తొక్కిసలాట మొదలైందని.. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. తొక్కిసలాటలో మృతిచెందిన 89 మంది డెడ్ బాడీలను హత్రాస్ లోని ఆస్పత్రిలో ఉంచామని సీనియర్ ఎస్పీ రాజేశ్ కుమార్ సింగ్ వెల్లడించారు. పొరుగు జిల్లా ఎటాలోని జిల్లా ఆస్పత్రికి 27 మంది డెడ్ బాడీలను తరలించామని తెలిపారు. ఇప్పటివరకు మృతుల్లో 72 మందిని గుర్తించామన్నారు. 

తొక్కిసలాటలో ఒక పురుషుడు, ఏడుగురు చిన్నారులు ఉండగా మిగతా వాళ్లంతా మహిళలే ఉన్నారని చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్ ప్రకటించారు. బాధితులను అధికారులు ట్రక్కుల్లో స్థానిక ట్రామా కేర్ ఆస్పత్రికి తరలించారు. ఒక్కో వెహికల్​లో పది మందిదాకా అపస్మారకస్థితిలో పడి ఉండటం కనిపించింది. పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ల తరఫు బంధువులు వందలాదిగా ఆస్పత్రి వద్ద గుమిగూడారు. హాస్పిటల్ వద్ద రోదనలు మిన్నంటాయి.

ఎంట్రీ, ఎగ్జిట్ ఒకే రూట్​కావడంతో.. 

హత్రాస్​ జిల్లాలోని ఫూల్ రాయ్ గ్రామం వద్ద ఆధ్యాత్మిక గురువు భోలే బాబా సత్సంగ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మంగళవారంతో ముగియనుండటంతో వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం తర్వాత కార్యక్రమం ముగింపు దశలో ఉండగా జనం ఒక్కసారి పరుగులు తీయడం ప్రారంభించారు. ఎంట్రీ, ఎగ్జిట్ ఒకే రూట్​కావడంతో రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. మధ్యాహ్నం నుంచి ఎండ తీవ్రంగా ఉండటం, మరోవైపు ఒకేచోట విపరీతంగా జనం గుమిగూడటంతో కొంతమందికి ఊపిరాడలేదని, వాళ్లు బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించారని గాయాలతో ఆస్పత్రిపాలైన ఓ వ్యక్తి మీడియాకు తెలిపారు. 

బాధ్యులపై కేసులు పెడ్తం: సీఎం యోగి

తొక్కిసలాట ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు. స్పాట్​కు వెళ్లి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని, గాయాలైనోళ్లకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరు రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీని కూడా స్పాట్​కు వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. 

ఘటనపై విచారణ కమిటీని కూడా యోగి అపాయింట్ చేశారు. దర్యాప్తు ప్యానెల్​కు ఆగ్రాలోని అడిషనల్ డీజీపీ, అలీగఢ్ కమిషనర్ నేతృత్వం వహిస్తారని అధికారులు తెలిపారు. కార్యక్రమం నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామన్నారు. కాగా, మృతుల కుటుంబాలకు పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామని పీఎంవో ప్రకటించింది.