Paris Olympics 2024: మిషన్ పారిస్ ఒలింపిక్స్‌.. భారత్‌ నుంచి 117 మంది అథ్లెట్లు

Paris Olympics 2024: మిషన్ పారిస్ ఒలింపిక్స్‌.. భారత్‌ నుంచి 117 మంది అథ్లెట్లు

జూలై 26 నుండి పారిస్‌( ఫ్రాన్స్) వేదికగా విశ్వ క్రీడలు(ఒలింపిక్స్‌) ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడల్లో భారత్ దేశం తరుపున 117 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. వీరి జాబితాను భార‌త ఒలింపిక్ సంఘం బుధవారం(జులై 17) రిలీజ్ చేసింది. వీరితో పాటు ఒలింపిక్స్ క్రీడ‌ల‌కు 140 మంది సహాయ సిబ్బంది కూడా వెళ్తున్నట్లు ఐఓఏ వెల్లడించింది. అయితే, పారిస్ వెళ్తున్న బృందంలో ఒలింపిక్స్కు అర్హత సాధించిన షాట్ పుట్ ప్లేయర్ అభా ఖ‌తువా పేరు  లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆమె ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆమె పేరు ఎందుకు తొలగించారనే దానిపై ఐఓఏ కూడా స్పష్టత ఇవ్వలేదు. 

అథ్లెట్లతో పాటు పారిస్ వెళ్తున్న 140 మంది సహాయక సిబ్బందిలో  72 మంది ఖర్చులు మాత్రమే ప్రభుత్వం భరించనుంది. నిబంధనల ప్రకారం సహాయక సిబ్బంది సంఖ్య 67 మించకూడదు. దీంతో ఐదుగురు వైద్య బృందం, సహాయక సిబ్బంది 67 కలిపి మొత్తం 72 మందికి ప్రభుత్వం ఖర్చులు భరించనుంది. "అథ్లెట్లు, అదనపు కోచ్‌లు, 72 మంది ఇతర సహాయక సిబ్బంది ఖర్చులకు ప్రభుత్వం ఆమోదించింది. వారి బస కోసం గేమ్స్ విలేజ్ వెలుపల ఉన్న హోటళ్లలో ఏర్పాట్లు చేయబడ్డాయి.." అని మంత్రిత్వ శాఖ నుండి ఒక లేఖ అందిందని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు.

20 క్రీడా విభాగాల్లో..

భారత అథ్లెట్లు 20 క్రీడా విభాగాల్లో పాల్గొననున్నారు. ఈక్వెస్ట్రియన్, జూడో, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో ఒకొక్కరు పోటీపడుతుండగా.. టేబుల్ టెన్నిస్‌ (8),  బ్యాడ్మింటన్‌ (7), రెజ్లింగ్‌ ( 6), ఆర్చరీ (6), బాక్సింగ్ (6), గోల్ఫ్‌ (4), టెన్నిస్ (3), స్విమ్మింగ్ (2), సెయిలింగ్‌లో ఇద్దరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

క్రీడల వారీగా భారత అథ్లెట్లు

  • అథ్లెటిక్స్: 29(11 మంది మహిళలు, 18 మంది పురుషులు)
  • షూటింగ్: 21
  • హాకీ: 19
  • టేబుల్-టెన్నిస్: 8
  • బ్యాడ్మింటన్: 7
  • రెజ్లింగ్‌: 6
  • ఆర్చరీ: 6
  • బాక్సింగ్: 6
  • గోల్ఫ్: 4
  • టెన్నిస్: 3
  • స్విమ్మింగ్: 2
  • సెయిలింగ్: 2
  • గుర్రపు స్వారీ: 1
  • జూడో: 1
  • రోయింగ్: 1
  • వెయిట్ లిఫ్టింగ్: 1