రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శుక్రవారం లక్షా 17 వేల 100 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 302 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటి రేటు 7.74శాతం ఉందని తెలిపింది. కాగా.. 30వేల 836మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం మొత్తం 3 లక్షల 71వేల 363 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. గురువారం కేసులతో పోల్చితే 28 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయని ఐసీఎంఆర్ తెలిపింది.

ఇటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 377 కేసులు నమోదయ్యాయి. దాంతో దేశంలో మొత్తం 3వేల 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 27 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ విస్తరించిందని అధికారులు ప్రకటించారు. మహరాష్ట్ర, ఢిల్లీ, కేరళలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు 876 ఉన్నాయి. ఢిల్లీలో 465 కేసులు ఉండగా.. కేరళలో 333 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడులోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలో 107 కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 

దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం మరోసారి అలెర్ట్ జారీ చేసింది. పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని సూచించింది. జిల్లా, సబ్ స్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆస్పత్రుల్లో సిబ్బంది, మౌలికవసతులు, పడకల లభ్యతతో పాటు..హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి తగిన వైద్య సూచనలు ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశించింది.  కాగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు రెండో సారి కరోనా నిర్ధారణ అయ్యింది. గతేడాది ఆగస్టులో ఆయన కరోనా బారినపడ్డారు. ప్రధాని మోడీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రాతో పాటు.. కేంద్ర  మానవ వనరుల శాఖ అదనపు కార్యదర్శి రాకేశ్ రంజన్, ముగ్గురు సంయుక్త కార్యదర్శులు, 12 మందికిపైగా జూనియర్ అధికారులు వైరస్ బారినపడ్డారు.