పతకాలు ఎవరికో..నేటి నుంచి పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌..ఇండియా నుంచి 117 మంది

పతకాలు ఎవరికో..నేటి నుంచి పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌..ఇండియా నుంచి 117 మంది
  • నేటి నుంచి పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌.. బరిలో 10 వేల 500 మంది అథ్లెట్లు
  • ఇండియా నుంచి 117 మంది.. రా. 11.30 నుంచి ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ సెర్మనీ

సెకన్‌‌‌‌‌‌‌‌లో ఫలితాలు మారిపోతాయి..! నిమిషాల్లో జీవితాలు తలకిందులవుతాయి..! సింగిల్‌‌‌‌‌‌‌‌ నైట్‌‌‌‌‌‌‌‌లో జీరోలు.. హీరోలవుతారు..! పతకం ఖాయం అనుకున్నోళ్లు.. రిక్త హస్తాలతో వెనుదిరుగుతారు..! కొందరు పోరాటం చేస్తే.. మరికొందరు ప్రాణాలే ఫణంగా పెడతారు..! ఒక్క మెడల్‌‌‌‌‌‌‌‌ యావత్‌‌‌‌‌‌‌‌ దేశాన్ని పులకింప చేస్తుంది..! ఒక్క విజయం అథ్లెట్‌‌‌‌‌‌‌‌ను ఎక్కడికో తీసుకెళ్తుంది..! రిక్షా కార్మికుడి నుంచి దేశాధ్యక్షుడి వరకు ఆసక్తిగా ఎదురుచూసే విశ్వ క్రీడల సంబురానికి సమయం ఆసన్నమైంది..!పారిస్‌‌‌‌‌‌‌‌ వేదికగా నేడు ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు తెరలేవనుంది..! 32 క్రీడాంశాల్లో 329 మెడల్స్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా 10 వేల 500 మంది బరిలోకి దిగుతున్నారు..! ఇండియా నుంచి 117 మంది అథ్లెట్లు 16 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు..! రూ. 470 కోట్ల ఖర్చుతో మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయిన ఇండియన్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్లు.. టోక్యోలో సాధించిన ఏడు పతకాలను డబుల్‌‌‌‌‌‌‌‌ చేస్తారా?

పారిస్‌ ‌‌‌‌‌‌‌: యావత్‌‌‌‌‌‌‌‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు నేడు తెరలేవనుంది. అందమైన ఈఫిల్‌‌‌‌‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌.. దాని చుట్టూ అల్లుకున్న పురాతన నగరంలో 16 రోజుల పాటు అంగరంగ వైభవంగా పోటీలు జరగనున్నాయి. పారిస్‌‌‌‌‌‌‌‌ నగరంలో ప్రతి మూలన ఏదో ఒక పోటీని నిర్వహించనున్నారు. ప్రఖ్యాత సీన్‌‌‌‌‌‌‌‌ నదిపై శుక్రవారం సాయంత్రం భారీ ఎత్తున ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ సెర్మనీ జరగనుంది. ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ చరిత్రలో ఓ నదిపై ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలు, డ్యాన్స్‌‌‌‌‌‌‌‌లు ఉండనున్నాయి.

నదికి ఇరువైపుల ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. నది మధ్యలో పడవల్లో తమ దేశ జెండాలతో అథ్లెట్లు కవాతు చేయనున్నారు. ప్లేయర్లను, వాళ్ల హావభావాలను దగ్గర్నించి చూసేందుకు బోట్లలోనే లైవ్‌‌‌‌‌‌‌‌ కెమేరాలను అమర్చారు. తూర్పు నుంచి పడమర దిశగా దాదాపు ఆరు కిలో మీటర్లు ఈ పరేడ్‌‌‌‌‌‌‌‌ సాగుతుంది. 80 భారీ స్క్రీన్‌‌‌‌‌‌‌‌లు, ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ రాజధాని మొత్తం వినపడేలా ప్రత్యేకమైన సౌండ్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ కోసం వీనుల విందైన మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చారు.

కరోనా భయంతో టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న అథ్లెట్లకు ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకున్నామని ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ ఇమాన్యుయేల్​ మాక్రాన్‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చారు. ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ థియేటర్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ జాలీ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ పారిస్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభోత్సవ వేడుకలను డిజైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో 330 మీటర్ల పొడవైన ఈఫిల్‌‌‌‌‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 

కట్టుదిట్టమైన భద్రత..

ప్రపంచ వ్యాప్తంగా 10 వేల 500 మంది అథ్లెట్లతో పాటు ఇతర ప్రముఖులు ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు తరలి రానున్నారు. వీళ్ల కోసం ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. పారిస్‌‌‌‌‌‌‌‌లో నివసించే పౌరులకు ఐడీ కార్డులను అందజేసింది. ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌ బృందానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజధాని చుట్టూ 150 కిలో మీటర్ల మేరకు నో ఫ్లై జోన్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించారు. యుద్ధ విమానాలు గగన తలాన్ని పర్యవేక్షించనున్నాయి. నిఘా విమానాలు, డ్రోన్‌‌‌‌‌‌‌‌లు, షార్ప్‌‌‌‌‌‌‌‌ షూటర్లు, డ్రోన్‌‌‌‌‌‌‌‌లను మోసుకెళ్లే హెలికాప్టర్లను మోహరించారు. పారిస్​ మొత్తం పోలీసు పహారాలోకి వెళ్లిపోయింది. 

వందేళ్ల క్రితం స్టేడియంలో..

1924లో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు అతిథ్యమిచ్చిన యిస్‌‌‌‌‌‌‌‌ డ్యూ మనోయిర్‌‌‌‌‌‌‌‌ స్టేడియం మరోసారి ఈ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో కీలక పాత్ర పోషించనుంది. అప్పట్లో అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌, గుర్రపు స్వారీ, ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌, రగ్బీకి ఆతిథ్యమ్చిన ఈ స్టేడియాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ స్టేడియంలో హాకీ పోటీలు జరగనున్నాయి. ఇక ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌లో అతి పెద్దదైన స్టేడ్‌‌‌‌‌‌‌‌ డి ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఈసారి ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ కోసం కొత్తగా రెండు స్టేడియాలను నిర్మించారు.

ఇందులో ఒకటి మూసుకునే స్టేడియం (పీరె మారోయ్‌‌‌‌‌‌‌‌) కూడా ఉంది. ఈఫిల్‌‌‌‌‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌ ముందు తాత్కాలిక స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో బీచ్‌‌‌‌‌‌‌‌ వాలీబాల్‌‌‌‌‌‌‌‌ పోటీలు జరుగుతాయి. మొత్తానికి చారిత్రక, రాజరిక వైభవాన్ని చాటేవి కొన్ని, పర్యావరణానికి అనుకూలమైన స్టేడియాలను నిర్మించారు. మొత్తం 35 వేదికలు పోటీలకు ఆతిథ్యమివ్వనున్నాయి.