- గ్రేటర్లోని చెరువుల వద్ద.. 1,170 సీసీ కెమెరాలు
- టెండర్లను ఆహ్వానించనున్న జీహెచ్ఎంసీ
- బల్దియా స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లోని చెరువుల వద్ద 1,170 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు టెండర్లను పిలిచేందుకు బల్దియా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బల్దియా స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. మెదక్ రోడ్ సాయినగర్ నుంచి మెట్టుకాని గూడెం వరకు 18 మీటర్ల రోడ్డు వెడల్పునకు 139 ఆస్తుల సేకరణ, రియాసత్ నగర్ పరిధి ఇందిరానగర్లో అహ్మద్ కేఫ్ నుంచి కైసర్ కిరాణం వరకు 12 ఫీట్ల రోడ్డు వెడల్పునకు 42 ఆస్తుల సేకరణ, ఖాజాగూడ సర్వే నం.27/2లో పాత 120 ఫీట్ల లింక్ రోడ్డు, ఫుట్ పాత్ నిర్మాణం, చెరువుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లతో పాటు మరో 3 అంశాలకు స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు రషీద్, బండారి రాజ్ కుమార్, వనం సంగీత, రంగం నరేందర్, కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.