3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు

3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు
  • కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి 80‌‌, టీచర్ స్థానానికి 15
  • నల్గొండ టీచర్​ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్​
  • ముగిసిన గడువు.. చివరిరోజు పోటెత్తిన అభ్యర్థులు 
  • ఈ నెల 27న పోలింగ్​.. వచ్చే నెల 3న కౌంటింగ్​

కరీంనగర్‌/ నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 118 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ‘కరీంనగర్’ గ్రాడ్యుయేట్స్, టీచర్స్‌, ‘నల్గొండ’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి  ఈ నెల 3న నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చివరి గడువు పూర్తయింది.  గడువు ముగిసే సమయానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 80, టీచర్స్​ ఎమ్మెల్సీలకు 38  మంది నామినేషన్ ​వేసినట్టు అధికారులు తెలిపారు. కరీంనగర్-–-ఆదిలాబాద్--– నిజామాబాద్--– మెదక్‌ స్థానాలకు సోమవారం మొత్తం 59 నామినేషన్లు దాఖలవగా.. 

అందులో 51 నామినేషన్లు గ్రాడ్యుయేట్, 8 నామినేషన్లు టీచర్స్‌ స్థానానికి వచ్చాయి. మొత్తంగా గ్రాడ్యుయేట్​కు 80 మంది 125 సెట్లు, టీచర్​ ఎమ్మెల్సీకి 15 మంది 22 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు అభ్యర్థుల అనుచరుల ర్యాలీలతో కరీంనగరం కిక్కిరిసిపోయింది.  కలెక్టరేట్‌ప్రాంగణంలో ఆంక్షల కారణంగా కేవలం అభ్యర్థులనే అనుమతించారు.  కాగా, వరంగల్‌-–ఖమ్మం–నల్గొండ టీచర్​ఎమ్మెల్సీకి 23 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం  ప్రధాన సంఘాల అభ్యర్థులు నల్గొండలో ర్యాలీ తీశారు. 

ఎన్జీ కాలేజీ నుంచి క్లాక్ టవర్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనలు,  బైకులు,  కార్లతో ర్యాలీలు చేపట్టారు.  ఈ నెల13న మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చాన్స్ ఉంది. ఈ నెల 27న పోలింగ్‌ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.