ఆర్కేపీ ఓసీపీలో 118 శాతం బొగ్గు ఉత్పత్తి

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్​ సింగరేణి ఓపెన్ ​కాస్ట్ గనిలో 118 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఏరియా జీఎం ఎ.మనోహర్​ తెలిపారు. ఇందుకు ఉద్యోగులు, కార్మికులు, అధికారులు, సూపర్​వైజర్ల సమష్టి కృషి కారణమన్నారు. డిసెంబర్​ నెలలో ఏరియా బొగ్గు గనులు సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను సోమవారం మందమర్రి జీఎం ఆఫీస్​ కాన్ఫరెన్స్​ హాల్​లో వెల్లడించారు. 

నెలాఖరు నాటికి అన్ని గనుల్లో 4,33,000 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 89శాతంతో  3,87,202 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. రామకృష్ణాపూర్​లో ఓసీపీలో లక్షా 50 వేల టన్నులకు గానూ లక్షా 76 వేల 259 టన్నులతో 118 శాతం, కేకే -5 గనిలో 17 వేల టన్నులకు 18 వేల 939 టన్నులతో 111 శాతం ఉత్పత్తి సాధించాయన్నారు. కాసీపేట1, కాసీపేట2, శాంతిఖని బొగ్గు గనుల్లో ఎస్డీఎల్స్​ మెషీన్లు అందుబాటులోకి రాకపోవడంతో ఉత్పత్తిలో వెనుకంజ చేసినట్లు చెప్పారు. 

ఏరియా ఏస్వోటు జీఎం రాజేశ్వర్​రెడ్డి, పర్సనల్​ మేనేజర్ ​శ్యాంసుందర్, డీజీఎం ఐఈడీ రాజన్న, ఆర్కేపీ, కేకే ఓసీపీల పీవోలు గోవిందరావు, రమేశ్, డీజీఎం భగవత్​ఝా, డీవైపీఎం ఆసిఫ్, కమ్యూనికేషన్ సెల్​బాధ్యులు పాల్గొన్నారు.

వార్షిక లక్ష్యాన్ని సాధిస్తాం
 

నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియా వార్షిక లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి అన్నారు. జీఎం కాన్ఫరెన్స్ హాల్​లో మీడియాతో మాట్లాడుతూ..  శ్రీరాంపూర్ ఏరియాలో వార్షిక లక్ష్యం 66.4 మిలియన్ టన్నులు ఉండగా  40.01మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించామన్నారు. ఇంకా ఉన్న మూడు నెలల గడువులో 100 శాతం లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన ఉత్పత్తిలో ఆర్కే5 గని 99 శాతం, ఆర్కే6 గని 103 శాతం, ఆర్కే7 గని 80 శాతం, ఆర్కే న్యూటెక్ గని 96 శాతం, ఎస్ఆర్పీ3 గని 85 శాతం, ఎస్ఆర్పీ1గని 67, ఐకే1ఏ గని 75 శాతం, భూగర్భ గనులు 86 శాతం ఉత్పత్తి సాధించాయన్నారు. ఎస్వోటు జీఎం రఘుకుమార్, డీవైజీఎంలు ఆనందరావు, చిరంజీవులు, ఏజెంట్లు ఏవీ రెడ్డి, రాముడు తదితరులు పాల్గొన్నారు.