
- వరద బీభత్సానికి కొట్టుకపోయిన చేన్లు.. మునిగిన పొలాలు
- పంట నష్టం.. 16 లక్షల ఎకరాల్లో
- వరద బీభత్సానికి కొట్టుకపోయిన చేన్లు.. మునిగిన పొలాలు
- పత్తి, వరి, సోయా, పెసర, మొక్కజొన్నకు భారీ ఎఫెక్ట్
- పొలాల్లో ఇసుక మేటలు..రాళ్లు, రప్పలు
- ఈ సీజన్‌లో రైతులు నిలదొక్కుకోవడంకష్టమేనంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి/మల్హర్, వెలుగు: భారీ వర్షాలు, వరదలకు పచ్చని పంటలు ఆగమైనయ్. లక్షల ఎకరాల్లో నాట్లు వేసిన వరి, పత్తి తదితర చేన్లు ఆనవాళ్లు లేకుండా కొట్టుకపోయాయి. సాగు కోసం ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా పెట్టిన పెట్టుబడి మొత్తం గంగపాలైంది. వరదలతో చెరువులు తెగి పొలాల్లో రాళ్లు రప్పలు, ఇసుక మేటలు వేసి సాగుకు పనికి రాకుండా మారాయి. 12రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల ఎకరాల్లో రూ.3వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయి.
గోదావరి వరదతో భారీ ఎఫెక్ట్
వ్యవసాయశాఖ పంట నమోదు రిపోర్టు ప్రకారం ఈ వానాకాలం సీజన్‌లో 68.80 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగింది. వర్షాలకు, వరదలకు 16లక్షల ఎకరాల్లో పత్తి, వరి, సోయా, కంది, పెసర, మొక్కజొన్న తదితర పంటలు బాగా దెబ్బతిన్నాయి. పంటలన్నీ విత్తనం, మొలక దశలోనే ఉండటంతో నష్టం భారీగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఆదిలాబాద్, ఆసీఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు కొత్తగూడెం జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. భూపాలపల్లి జిల్లా మోరంచవాగు, చలివాగు పొంగడంతో పాటు 23 చెరువుల తెగిపోయాయి. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో నదికి రెండు వైపులా కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలోని పంటలన్ని మునిగిపోయాయి. మున్నేరు, పాలేరు తదితర వాగులు, చెరువులు పొంగడంతో పరివాహక ప్రాంతాల్లోని పొలాలు నీటమునిగాయి. ఈ ప్రాంతాల్లో వానాకాలం పంటలన్ని కూడా పూర్తిగా నాశనమైట్టే అని అధికారులు అంటున్నారు.
బీడువెట్టాల్సిన దుస్థితి
వరదలతో లక్షల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. భూముల మధ్య హద్దులు కూడా కొట్టుకుపోయాయి. ఇసుక మేటలు తొలగించడానికి ఎకరాకు రూ.20 వేలకు పైగా ఖర్చు అవుతుందని రైతులు చెప్తున్నారు. పొలాలు మళ్లీ సాగుయోగ్యంగా చేసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత పెట్టుబడి పెట్టే స్థితిలో లేమని భూమి మొత్తం బీడుపెట్టాల్సి వస్తున్నదని వాపోతున్నరు.
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనేరూ.500 కోట్ల నష్టం
భారీ వర్షాలు, వదరలకు భూపాలపల్లి, ములుగు జిల్లాలలో రైతులకు సుమారు 500 కోట్ల నష్టం వాటిల్లింది. దాదాపు 50 వేల ఎకరాల భూములు బీడుగా మారిపోయాయి. 120 చెరువులు తెగి, వాగులు ఉప్పొంగి 15 వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. నాలుగు వందలకు పైగా బోరుబావులు పూడుకుపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు, స్తంభాలు కొట్టుకుపోయాయి. చెరువుల కింద సాగయ్యే సుమారు 50 వేల ఎకరాల్లో పంటలు కొట్టుకపోయాయి. చెరువులకు రిపేర్లు చేయాలంటే రూ.100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. చెరువులు తెగడం వల్ల వాటిలో పెంచిన చేపలు కొట్టుకుపోయి మత్స్యకారులకు సుమారు రూ.50 కోట్ల నష్టం వాటిల్లింది. విద్యుత్ లైన్లు కొట్టుకుపోవడంతో రెండు జిల్లాలో చాలా ప్రాంతాలకు ఐదు రోజులుగా కరెంటు సప్లై అవడం లేదు.
మోకాలు లోతు ఇసుక మేటలు వేశాయి
మానేరు వాగు ఉధృతికి నా ఐదు ఎకరాల పొలంలో మోకాలు లోతు ఇసుక మేటలు వేశాయి. వరినారు మొత్తం కొట్టుక పోయింది. ఈసారి పొలం సాగు చేసే పరిస్థితి కనిపిస్త లేదు. నాకు రూ.2 లక్షల నష్టం కలిగింది. ఇసుక మేటలు వేసిన పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి.
‒ మేడ తిరుపతి, కుంభంపల్లి, మల్హర్ మండలం, భూపాలపల్లి జిల్లా
రూ.8 లక్షలు నష్టం వచ్చింది
నాకున్న ఎనిమిది ఎకరాల్లో వరి వేసిన. మానేరుకు వచ్చిన భారీ వరదలతో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, రెండు బోర్లు కొట్టుకపోయాయి. ఎనిమిది ఎకరాల్లో నడుము లోతులో ఇసుక మేటలు వేశాయి. రూ.8 లక్షల నష్టం వాటిల్లింది.
‒ బొమ్మ ప్రతాప్, వల్లెంకుంట రైతు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా