ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గుర్తింపు ఉంది. అలాంటి దుబాయ్ లో గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదు కావడంతో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఇండిగో వంటి ప్రధాన విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి.
అలాగే హైదరాబాద్ నుంచి దుబాయ్ కు వెళ్లే 12 విమానాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్‌కి వెళ్లే అన్ని సర్వీసులను రద్దు చేసినట్లుగా ఆయా సంస్థలు ప్రకటించాయి. దుబాయ్‌లో మంగళవారం కేవలం 12 గంటల్లో రికార్డు స్థాయిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని నివేదికలు చెబుతున్నాయి.
భారీగా వరదలు రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లు, మాల్స్ నీట మునిగాయి. దుబాయ్ మెట్రో స్టేషన్ లో మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 1949 తరువాత దుబాయ్ లో ఇదే అత్యధిక వర్షపాతం అని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు.