రామయ్యకు 12 బంగారు వాహనాలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య తిరువీధి సేవ కోసం 30 ఏండ్ల తర్వాత 12 బంగారు వాహనాలు వచ్చాయి. యూఎస్​ఏలోని ఎన్ఆర్ఐ వాసవీ అసోషియేషన్​ సభ్యులు గతేడాది జులై 3న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం చేయించుకోగా భద్రాచలం రామాలయం నుంచి అర్చకులు వెళ్లారు. వేదపండితులు కూడా క్రతువులో పాల్గొన్నారు. వారి విజ్ఞప్తి మేరకు భద్రాచలానికి చెందిన డా.ఎస్.ఎల్.కాంతారావు, ఆయన కొడుకులు సభ్యులను ఒప్పించి ఈ వాహనాలను తయారు చేయించారు. తమిళనాడులోని కుంభకోణంలో గరుడ, హనుమత్​, శేష, సూర్యప్రభ, చంద్రప్రభ, హంస, అశ్వ, కల్పవృక్ష, సార్వభౌమ, బంగారు సింహాసనం, గజ, సింహ వాహనాలను బంగారం పూతతో చేయించారు.

రామదాసు కాలంలో చేయించిన వాహనాలే ప్రస్తుతం స్వామిసేవకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ఆర్ఐల సహకారంతో రూ.75లక్షలతో చేయించిన బంగారు వాహనాలు రావడంతో మంగళవారం శోభాయాత్రగా గుడికి తీసుకెళ్లారు. ఈ వాహనాలకు మార్చి 2న అంకురారోపణ, 3న దివ్యవాహనాల ప్రతిష్ఠ చేయనున్నారు. 3వ తేదీ సాయంత్రం ద్వాదశ బంగారు వాహనాలతో సహా స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. 4వ తేదీ శ్రీసీతారామచంద్రస్వామికి సార్వభౌమ వాహన సేవ చేయనున్నారు. డా.ఎస్​.ఎల్​ కాంతారావు, పాకాల దుర్గాప్రసాద్​, యేగి సూర్యనారాయణ, గట్టు వెంకటాచారి, చారుగుళ్ల శ్రీనివాసరావు, అల్లం నాగేశ్వరరావు,బండారు కృష్ణయ్య పాల్గొన్నారు. 

నేటి నుంచి ఆన్​లైన్​లో శ్రీరామనవమి టిక్కెట్లు

మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల కల్యాణం, 31న నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం టిక్కెట్లు బుధవారం నుంచి ఆన్​లైన్​లో అమ్ముతున్నట్లు దేవస్థానం ఈఓ రమాదేవి తెలిపారు. భక్తులు www.bhadrachalamonline.com, http://www.bhadrachalamonline.com  ద్వారా టిక్కెట్లు బుక్​ చేసుకోవచ్చన్నారు. రూ.7500 శ్రీరామనవమి కల్యాణ ఉభయం టికెట్లు ఈఓ కార్యాలయం, ఆలయ టికెట్​కౌంటర్​లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 08743-232428 నంబర్​లో సంప్రదించవచ్చన్నారు.