
- రవాణా శాఖకు రూ. 4,485 కోట్లు కేటాయింపు
- ఇందులో 4,305 కోట్లు ఆర్టీసీ ఫ్రీ బస్సు స్కీంకే
- గత ఏడాది కంటే రూ.1,223 కోట్లు పెంపు
- రవాణా శాఖకు రూ. 8,535 కోట్ల రాబడి టార్గెట్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణం కోసం రూ.1,223 కోట్ల మేర నిధులను పెంచింది. రవాణా శాఖకు మొత్తం రూ.4,485 కోట్లు కేటాయించారు. ఇందులో మహాలక్ష్మి పథకానికే రూ.4,305 కోట్లు అలకేట్ చేశారు. గత బడ్జెట్లో రవాణా శాఖకు రూ.4,084 కోట్లు ఇవ్వగా, మహాలక్ష్మి పథకానికి రూ.3,082 కోట్లు కేటాయించారు. ఈ లెక్కన గత ఏడాదితో పోల్చితే ఈసారి రవాణా శాఖకు రూ.401 కోట్ల మేరకు, మహిళల ఫ్రీ బస్సు స్కీంకు రూ.1,223 కోట్ల మేరకు నిధులు పెరిగాయి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి బడ్జెట్లో ఈ స్కీంకు పెంచిన నిధులే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు గర్వంగా చెప్తున్నారు. అయితే, నిధుల్లో పెద్ద మొత్తంలో ఉచిత బస్సు స్కీంకే పోనుండగా, మిగిలిన రూ. 450 కోట్లతో ఆర్టీసీలో ఇతర అవసరాలు తీరడం కష్టమని ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ భవిష్యనిధి సంస్థకు, సహకార పరపతి సంఘానికి ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.1,800 కోట్లు బకాయి పడింది.
బడ్జెట్లో చేసిన కేటాయింపులతో ఈ బకాయిలను ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందన్న అనుమానం కలుగుతోం దని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ఇక ఉచిత బస్సు స్కీంతో మహిళా ప్రయా ణీకుల సంఖ్య రెండింతలయింది. దీంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కనీసం వెయ్యి బస్సులు కోనుగోలు చేసేందుకు రూ.1,600 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు చేసింది. ఈ బడ్జెట్ చూసిన తర్వాత కొత్త బస్సుల కొనుగోలుపై కూడా సందే హాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో 94 శాతం పెరిగిన ఆక్యుపెన్సీ
ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రారంభ దశలో 69 శాతంగా ఉన్న ఆక్యూపెన్సీ ఇప్పుడు 94 శాతానికి పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఈ పథకంతో ఇప్పటివరకు 7,227 బస్సుల్లో 149 కోట్ల 63 లక్షల సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, దీంతో మహిళలకు రూ.5 వేల 5 కోట్ల 95 లక్షలు ఆదా అయిందన్నారు. ఈ స్కీం కోసం ఆర్టీసీలో 6,400 మంది ఉద్యోగులను అదనంగా నియమించామని చెప్పారు.
అలాగే ఆర్టీసీకి అదనంగా సుమారు రూ. వెయ్యి కోట్లను ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి సమకూర్చనున్నట్లు బడ్జెట్లో పొందుపరిచారు. కాగా, రవాణా శాఖకు 2025–26 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.8,535 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ గా నిర్దేశించింది. గత ఏడాది రూ. 7,500 కోట్లు నిర్దేశించగా, ఈ ఏడాది అదనంగా మరో రూ. వెయ్యి కోట్ల రాబడి టార్గెట్‌ను పెంచింది.
ఆర్టీసీకి అదనంగా ఇచ్చిందేమీ లేదు: ఎస్ డబ్ల్యూఎఫ్
ఈ బడ్జెట్లో ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదని, సంస్థకు తీరని అన్యాయం జరిగిందని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శివీఎస్ రావు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బడ్జెట్‌ను సవరించి ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు కేటాయించాల ని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. వెయ్యి కోట్లు సమకూర్చినా ఆర్టీసీకి ప్రయోజకరంగా ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు.