- టెర్రరిస్టులది పిరికి చర్య: సీఎం ఒమర్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో టెర్రరిస్టుల దాడులు ఆగడం లేదు. ఆదివారం శ్రీనగర్‌లో గ్రెనేడ్ విసిరి 11 మంది పౌరులను గాయపరిచారు. ఆలిండియా రేడియో, దూరదర్శన్ కేంద్రం సమీపంలో సీఆర్ పీఎఫ్ బంకర్ వద్ద సండే మార్కెట్లో ఈ ఘటన జరిగింది. టెర్రరిస్టులు సీఆర్ పీఎఫ్ బంకర్‌ను లక్ష్యంగా చేసుకొని గ్రెనేడ్ విసిరారు. అయితే, గ్రెనేడ్ గురితప్పి టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ సమీపంలో రోడ్డుపై పడి పేలిపోయింది. దీంతో 11 మంది పౌరులు గాయపడ్డారు.
ఈ దాడితో మార్కెట్ లో జనాలు భయాందోళనకు గురై ప్రాణరక్షణ కోసం పరుగులు తీశారు. కాసేపటికి పోలీసులు ఘటనా స్థలానికి బాధితులను ఆసుపత్రికి తరలించారు. పాకిస్తానీ లష్కరే తాయిబా టాప్ కమాండర్‌ను శనివారం శ్రీనగర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన మరుసటి రోజే ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని సీఎం ఒమర్ అబ్దుల్లా ‘ఎక్స్’ లో ఖండించారు. టెర్రరిస్టులది పిరికి చర్య అని, అమాయకులను చంపడం ఏందని ఆయన మండిపడ్డారు.
‘‘గత కొద్దిరోజులుగా కాశ్మీర్లో టెర్రరిస్టులు దాడులు చేస్తూ అమాయకులను చంపుతున్నారు. తాజాగా సండే మార్కెట్లో గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకొని చంపడం ఎంతమాత్రం కరెక్టు కాదు. టెర్రరిస్టుల దాడులకు అడ్డుకట్ట వేయడానికి భద్రతా బలగాలు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రజలు నిర్భయంగా తిరిగేలా చూడాలి” అని సీఎం పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తారిక్ హమీద్ కూడా ఈ దాడిని ఖండించారు.