మహా రాష్ట్రలో ట్రాలీ బోల్తా.. ఆదిలాబాద్‌‌కు చెందిన 12 మందికి గాయాలు

మహా రాష్ట్రలో ట్రాలీ బోల్తా.. ఆదిలాబాద్‌‌కు చెందిన 12 మందికి గాయాలు
  • నలుగురి పరిస్థితి విషమం

గుడిహత్నూర్, వెలుగు : మహారాష్ట్రలో ట్రాలీ పల్టీ కొట్టిన ఘటనలో ఆదిలాబాద్‌‌ జిల్లాకు చెందిన 12 మంది గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్‌‌ జిల్లా గుడిహత్నూర్‌‌ మండలంలోని గురుజ గ్రామానికి చెందిన జాదవ్‌‌ రాజు తన కుటుంబసభ్యులు, బంధువులు 16 మందితో కలిసి ట్రాలీ ఆటోలో మంగళవారం మహారాష్ట్రలోని చంద్రపూర్‌‌ అమ్మవారి దర్శనానికి వెళ్లాడు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా రాత్రి 11.30 గంటలకు కోర్పణ గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఆటో బోల్తా పడింది.

దీంతో రాజుతో పాటు 12 మంది గాయపడ్డారు. ఇందులో రాజు తల్లి సీతాబాయి, మరో యువకుడు గెడం జగదీశ్, నాందేడ్‌‌కు చెందిన రాజు అత్తమ్మ, రాజు మేన కోడలుకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని ఆదిలాబాద్‌‌ రిమ్స్‌‌కు తరలించారు. రాజు తల్లి సీతాబాయిని హైదరాబాద్‌‌కు, అత్త, మేనకోడలిని నాందేడ్‌‌కు తరలించారు. డ్రైవర్‌‌ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిఆపరు.