జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికార్ జిల్లాలో అతి వేగంగా దూసుకెళ్లిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు సలాసర్ నుంచి సికర్ జిల్లాకు వస్తుండగా లక్ష్మణ్‌గఢ్ వద్దకు ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. సాలాసర్ నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సికార్ జిల్లా ఎస్పీ భువన్ భూషణ్ యాదవ్ తెలిపారు. మంగళవారం (అక్టోబర్ 29) మధ్యాహ్నం 2 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగినట్లు ఆయన వెల్లడించారు.
బస్సు ప్రమాదంలో 12 మంది మరణించారని.. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను లక్ష్మణ్‌గఢ్, సికార్‌లోని ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. కాగా, బస్సు ప్రమాదం జరిగిన ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ప్రమాద తీవ్రతకు బస్సు ముందుగ భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాజస్థాన్ సీఎం సంతాపం:
సికార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. సికార్‌లోని లక్ష్మణ్‌గఢ్ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరమని.. హృదయ విదారకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.