తెలంగాణకు పదేండ్లలో రూ.12 లక్షల కోట్లు

తెలంగాణకు పదేండ్లలో రూ.12 లక్షల కోట్లు
  • రాజ్య సభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: గత పదేండ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అలాగే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు డివల్యూషన్ ట్యాక్సెస్ కింద రూ.12. 19 లక్షల కోట్లు వచ్చాయన్నారు. బడ్జెట్ పై చర్చలో భాగంగా మంగళవారం రాజ్య సభలో జరిగిన బీజేపీ తరఫున లక్ష్మణ్ ప్రసంగించారు. 

రాష్ట్రానికి ఏమీ కేటాయించలేదని చెబుతూ కాంగ్రెస్ అబద్ధాలు చెప్తున్నదని ఫైర్ అయ్యారు. ఎన్టీపీసీ ద్వారా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం రూ.11 వేల కోట్లు కేటాయించిందన్నారు. కానీ.. ఈ విషయంలో రాష్ట్ర సర్కార్ కు నాలుగు సార్లు లేఖలు రాసినా.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఎక్కువ రేటుకు కరెంట్ కొనుగోలు చేసేందుకు గత బీఆర్ఎస్​ప్రభుత్వం కేంద్ర విజ్ఞప్తిని పక్కన పెట్టిందని ఆరోపించారు. 

నేషనల్ హైవేలకు రూ.1లక్షా 10 వేల కోట్లు ఇచ్చామన్నారు. పసుపు రైతుల కోసం నిజామాబాద్ లో టర్మరిక్ బోర్డు ప్రకటించామని చెప్పారు. ట్రైబల్ యూనివర్సిటీ, భువనగిరిలో ఏయిమ్స్, రామగుండం లో ఫెర్టిలైజర్ కెమికెల్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేశామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. వరంగల్ లో వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ కేటాయించారని చెప్పారు. అలాగే ఈ ఏడాది బడ్జెట్ లో తెలంగాణ, ఏపీలో రైల్వే అభివృద్ధికి రికార్డు స్థాయిలో కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. కానీ... 70 ఏండ్లలో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణకు ఇచ్చింది ఏమీలేదని విమర్శలు గుప్పించారు.