- 8 ఏండ్లలో 4 రెట్లు పెరిగారు
- ఎక్కువ మంది మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగుకు 11వ ప్లేస్
- యూఎస్‌కు ఏటా 70 వేల మంది స్టూడెంట్లు,10 వేల మంది హెచ్1బీ వీసా హోల్డర్లు
- ఏటా వెళ్లే స్టూడెంట్లలో 12.5 శాతం తెలుగు వారే
కాలిఫోర్నియా: అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గత ఎనిమిదేండ్లలో నాలుగు రెట్లు పెరిగింది. 2016లో 3.20 లక్షలు ఉన్న తెలుగు వారు 2024లో 12.30 లక్షలకు చేరుకున్నారు. దీంతో ఎక్కువ మంది మాట్లాడే విదేశీ భాషలలో తెలుగు 11వ స్థానానికి చేరుకుంది. అలాగే యూఎస్‌లో అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషల్లో మూడో స్థానంలో నిలిచింది. మొదటి ప్లేస్‌లో హిందీ, రెండో స్థానంలో గుజరాతీ ఉన్నాయి. అమెరికా సెన్సెస్ బ్యూరో డేటా ఆధారంగా ఆ దేశ స్టాటిస్టికల్ అట్లాస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుగు జనాభా పెరుగుదలకు నాలుగో తరం వలసదారులు, ఈ మధ్య కాలంలో వెళ్లిన స్టూడెంట్లు ప్రధాన కారణం. కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా దాదాపు 2 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. 1లక్షా 50 వేల మందితో టెక్సాస్ రెండో స్థానం, 1లక్షా 10వేల మందితో న్యూజెర్సీ మూడో స్థానంలో ఉన్నాయి. ఇల్లినాయిస్(83వేలు), వర్జీనియా(78 వేలు), జార్జియా(53వేలు) తదితర రాష్ట్రాల్లో కూడా తెలుగు వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2010 నుంచి 2017 మధ్యకాలంలో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86 శాతం పెరిగిందని అమెరికన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ 2017లో చేసిన స్టడీలో వెల్లడించింది. అమెరికాలో తెలుగు భాష అత్యంత వేగంగా విస్తరిస్తున్నదని సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ 2018లో తన స్టడీ రిపోర్టు రిలీజ్ చేసింది.
స్టూడెంట్లే ఎక్కువ
ప్రతి సంవత్సరం దాదాపు 70వేల మంది తెలుగు స్టూడెంట్లు, 10 వేల మందికి పైగా హెచ్1బీ వీసా హోల్డర్లు అమెరికాకు వెళ్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ మాజీ సెక్రటరీ అశోక్ కొల్లా మాట్లాడుతూ యూఎస్‌కు కొత్తగా వచ్చిన వారిలో 80 శాతం మంది తమ సంస్థలో నమోదు చేసుకున్నారని చెప్పారు. దాదాపు 75 శాతం మంది డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే తదితర సిటీల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఇండియన్ మొబిలిటీ 2024 రిపోర్ట్ ప్రకారం యూఎస్‌లోని ఇండియన్ స్టూడెంట్ల జనాభాలో తెలంగాణ, ఏపీ విద్యార్థులు 12.5 శాతం ఉన్నారు. కెంట్ స్టేట్ యూనివర్శిటీ వంటి విద్యాసంస్థల్లో ఈ దృశ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.