చత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

  • బీజాపూర్​లోని ఊసూరు అడవుల్లో ఘటన
  • 1,500 మంది జవాన్లతోకొనసాగుతున్న కూంబింగ్​
  • తెలంగాణ బార్డర్​లోని పోలీస్ స్టేషన్లకు భద్రత పెంపు

భద్రాచలం, వెలుగు: తెలంగాణ–చత్తీస్​గఢ్ బార్డర్​లోని బీజాపూర్ జిల్లాలో గురువారం భారీ ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్ జిల్లా దక్షిణ బస్తర్​లోని ఊసూరు అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారం అందింది. 

దీంతో బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల డీఆర్‌‌జీ (డిస్ట్రిక్ట్‌‌ రిజర్వ్‌‌డ్‌‌ గార్డ్), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్)తో పాటు సీఆర్‌‌పీఎఫ్ బెటాలియన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ నేతృత్వంలో మొత్తం 1,500 మంది జవాన్లు కూంబింగ్​లో పాల్గొన్నారు. మూడు జిల్లాల ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. గురువారం ఉదయం 9 గంటలకు జవాన్లు అంతా బీజాపూర్ జిల్లా ఊసూరు ఫారెస్ట్ ఏరియాలో ప్రవేశించారు.

అప్పటికే మావోయిస్టులంతా సమా వేశం అయ్యారు. అక్కడికి బలగాలు రావడంతో ఇరువర్గాల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు కొనసాగాయి. ఫైరింగ్​లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. మిగిలిన వాళ్లంతా అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలం నుంచి ఎస్​ఎల్ఆర్ తుపాకులు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మావోయిస్టులను పట్టుకునేందుకు జవాన్లంతా అడవిని జల్లెడపడుతున్నారు.

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల, ములుగు జిల్లా వెంకటాపురం బార్డర్ వరకు ఊసూరు అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నది. గోదావరి తీర ప్రాంతంలో కూడా పోలీసులు నిఘా పెంచారు. పారిపోయిన మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉండటంతో చత్తీస్​గఢ్ పోలీసులు అలర్ట్ చేశారు. కాగా, తెలంగాణ స్టేట్ మావోయిస్టు పార్టీకి చెందిన దళాలు.. ఎక్కువగా ఊసూరు అటవీ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారు. 

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్​కౌంటర్​లో వెంకటాపురం, చర్ల, శబరి ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఎవరైనా చనిపోయారా? అని తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. చత్తీస్​గఢ్​కు బార్డర్​లో ఉన్న తెలంగాణలోని పోలీస్ స్టేషన్లకు భద్రత పెంచారు.