టిబిలిసి: జార్జియా దేశంలోని ఇండియన్రెస్టారెంట్లో 12 మంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సెకండ్ ఫ్లోర్‌లోని స్లీపింగ్ ఏరియాలో పడుకున్న వారందరూ తెల్లారేసరికి చనిపోయి ఉన్నారని, వారందరూ గుడౌరీలో ఉన్న ఈ రెస్టారెంట్లో పనిచేసే వారేనని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో 11 మంది విదేశీయులు కాగా, ఒకరు జార్జియా పౌరుడు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నల్అఫైర్స్ ప్రకారం.. ఈ ఘటనపై జార్జియా క్రిమినల్ కోడ్‌లోని ఆర్టికల్ 116 ప్రకారం నిర్లక్ష్యపూరిత ప్రాణ నష్టం కింద కేసు నమోదు చేశారు.
కాగా, ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ 12 మందిపై ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని వెల్లడించారు. మృతదేహాలకు సమీపాన ఇండోర్ స్పేస్‌లో జనరేటర్ ఉన్నదని, గత సాయంత్రం విద్యుత్ కోత ఉండడంతో దాన్ని ఆన్ చేసినట్టు అనుమానిస్తున్నారు. వారి మరణానికి కచ్చితమైన కారణం తెలుసుకునేందుకు పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడించలేదు.