- టికెట్హామీతోనే చేరుతున్నారనే టాక్
- ఇప్పటికే 12 మంది అప్లికేషన్లు
- మైనంపల్లికి టికెట్ఇస్తే అసమ్మతి ఎగిసిపడే చాన్స్
- ఆశావహులను బుజ్జగించే పనిలో హైకమాండ్
మెదక్, వెలుగు : మెదక్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్‌లో చేరనుండటంతో ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ మెదక్ టికెట్ హామీతోనే తండ్రీకొడుకులు పార్టీలో చేరుతున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో టికెట్ ఆశిస్తున్నవారు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ మైనంపల్లికే టికెట్ ఇస్తే అసమ్మతి ఎగిసేపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆశావహులను బుజ్జగించే పనిలో నిమగ్నమైంది.
12 మంది దరఖాస్తు..
రానున్న ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం 12 మంది లీడర్లు హై కమాండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నలుగురు ముందు వరుసలో ఉన్నారు. కొన్నాళ్లు బీజేపీలోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు టికెట్ రేసులో ఉన్నారు.
ఎవరికి వారుగా ప్రయత్నాలు
పార్టీ పెద్దలతో తనకున్న పరిచయాల ద్వారా మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతిరెడ్డి, బాలకృష్ణ, సుప్రభాత్ రావు నియోజకవర్గ పరిధి మండలాల్లో పర్యటిస్తూ పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అమలు కాని ప్రభుత్వ, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే హామీలపై, అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులపై నిరసన తెలుపుతూ అటు పార్టీ హైకమాండ్.. ఇటు ప్రజల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రోహిత్ కే చాన్స్
మైనంపల్లి రోహిత్ తండ్రి హన్మంతరావుతో కలిసి బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తనకు మల్కాజ్గిరి, తన కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ను కోరినట్టు హన్మంతరావు వెల్లడించారు. ఈ మేరకు స్పష్టమైన హామీ లభించిన తరువాతే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా రోహిత్ పేరు ఖరారు కావడం లాంఛనమేనని అర్థమవుతోంది.
బుజ్జగింపులు షురూ..
ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ, క్యాడర్ ను కాపాడుకుంటూ, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసి.. టికెట్ తమకే వస్తుందన్న ధీమాలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకుల పరిస్థితి తాజా పరిణామాలతో అగమ్యగోచరంగా మారింది. ఈ విషయమై ఆశావహులను కదిలిస్తే కొందరేమో ఇంతకాలంగా పార్టీకోసం పనిచేసిన తమకు కాదని కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్లకు టికెట్ ఎలా ఇస్తారని అంటున్నారు. మరికొందరేమో న్యాయంగా అయితే తమకే టికెట్ ఇవ్వాలి.. కానీ పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని కాదనలేం కదా అని సర్దిచెప్పుకుంటున్నారు.
ALSO READ :- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూకుడు .. ఎన్నికల ముందు హడావుడి శంకుస్థాపనలు
కొత్త అభ్యర్థికే కాంగ్రెస్టికెట్లభిస్తే ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతూ దరఖాస్తు చేసినవారి నుంచి అసమ్మతి ఎగిసేపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆశావహులను బుజ్జగించే పనిలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్న ముఖ్యమైన లీడర్లకు పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్ట్‌ల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి పార్టీ ఖరారు చేసే అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలని నచ్చచెబుతున్నట్లు సమాచారం.