సూర్యాపేట జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

సూర్యాపేట, వెలుగు : ఇంటికి తాళం కనిపించిందంటే చాలు.. దొంగలు తమ చేతికి పని చెబుతున్నారు. ఉదయం టైంలో రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో గుట్టుగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఇక కొందరైతే పట్టపగలే ఇండ్లలోకి చొరబడి అందినకాడికి ఎత్తుకెళ్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 10 రోజుల్లోనే 12 చోరీలు జరుగగా సుమారు రూ. 50 లక్షల సొత్తు దొంగల పాలైంది. దీంతో జిల్లా ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మునుగోడు డ్యూటీలో స్థానిక పోలీసులు

మునుగోడు ఎన్నికలతో పాటు పట్టణాలు, గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దొంగలకు బాగా కలిసొచ్చింది. సూర్యాపేట జిల్లాకు చెందిన పోలీసులు సుమారు నెల రోజుల నుంచి మునుగోడు బందోబస్తు డ్యూటీలకు వెళ్లారు. దీంతో స్థానికంగా నిఘా కరువైంది. దీంతో పాటు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో దొంగలు రెచ్చిపోయారు. రాజస్థాన్‌‌, జార్ఖండ్‌‌, మధ్యప్రదేశ్‌‌కు చెందిన వ్యక్తులు జిల్లాలో దొంగతనాలకు  పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరు లాడ్జీల్లో ఉంటూ ఉదయం వేళల్లో తాళం వేసిన ఇండ్ల వద్ద రెక్కీ నిర్వహించి అదును చూసి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

10 రోజుల్లోనే 12 చోరీలు

సూర్యాపేట జిల్లాలో గత నెల 28 నుంచి 10 రోజుల వ్యవధిలోనే 12 చోరీలు జరిగాయి. ఆయా ఘటనల్లో 57 తులాల బంగారం, రూ.9.46 లక్షలతో పాటు కొంత మొత్తంలో వెండిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. గత పది నెలల్లో రూ.1.05 కోట్ల విలువైన సొత్తు చోరీకి గురైతే 10 రోజుల్లోనే రూ.50 లక్షలు సొమ్ము దొంగలపాలైంది. గత రెండు నెలల నుంచే జిల్లాలో చోరీ కేసులు నమోదు అవుతున్నాయి.  మరో వైపు దొంగలు పట్టపగలే ఇండ్లలోకి చొరబడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది మొత్తం 166 చోరీలు జరుగగా ఇందులో 90 ఘటనలు పగటి పూట జరిగినవే కావడం గమనార్హం.

దొంగలను పట్టుకునేందుకు 5 స్పెషల్‌‌ టీమ్స్‌‌

జిల్లాలో వరుస చోరీలు జరుగుతుండడంతో పోలీసులు అలర్ట్‌‌ అయ్యారు. చోరీల నివారణకు ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌ సీఐల పర్యవేక్షణలో ఐదు స్పెషల్‌‌ టీమ్స్‌‌ ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్‌‌ గతంలో చోరీలకు పాల్పడ్డ వారి రికార్డులను పరిశీలిస్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి ఫింగర్‌‌ ప్రింట్స్‌‌ సేకరించి వారికి నేర చరిత్ర ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. మూడు రోజుల క్రితం ఒక దొంగను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. 

ఇటీవల జరిగిన ఘటనలు

అక్టోబర్‌‌ 28న సూర్యాపేట హైటెక్‌‌ కాలనీలో ఓ టీచర్‌‌ ఇంట్లో దొంగలు పడి 17 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అలాగే అంజనాపురి కాలనీలోని ఓ ఇంట్లో రూ. 56 వేలు చోరీ చేశారు. అక్టోబర్ 29న సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం పరిధిలోని నాలుగు ఇండ్లలో చోరీ చేసి 26 తులాల బంగారం రూ.1.20 లక్షలు ఎత్తుకెళ్లారు.అక్టోబర్ 31న పట్టపగలే చివ్వెంల మండలం తిమ్మాపురానికి చెందిన రనబోతు కనకాలరెడ్డి ఇంటి తలుపులు పగులగొట్టి రూ.7.50 లక్షలు, 13 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.నవంబర్ 3న చివ్వెంల మండలం కుడకుడకు చెందిన హెడ్‌‌ కానిస్టేబుల్‌‌ అండెం సైదులు ఇంట్లో దొంగలు పడి రూ.10 వేలు, 80 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.