ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం పైసలియ్యడం లేదు. వడ్లు అమ్మి నెల రోజులు గడుస్తున్నా బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పైసలు వెంటనే వస్తాయని ఆశపడిన రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. స్కూలు పిల్లల ఫీజులు, ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులైనా డబ్బులు అకౌంట్లలో జమ కాలేదని వాపోతున్నారు. 12 వేల మంది రైతులకు రూ.154 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. జనవరి 3వ వారం వరకు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను ముందుగా పంట అమ్మిన వాళ్ల అకౌంట్లలో జమ చేస్తూ వస్తున్నామని, ఆ తర్వాత డబ్బులు రాకపోవడంతో ఆలస్యం అవుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు.
గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయట్లే..
ఈ సీజన్లో జిల్లాలో ప్రభుత్వం 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 3.80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 42,344 మంది రైతుల నుంచి 2.75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, ఇప్పటివరకు 30,344 మంది రైతులకు రూ.408 కోట్లు చెల్లించారు. ఇంకా 12 వేల మంది రైతులకు 75,684 మెట్రిక్ టన్నుల వడ్లకు సంబంధించి రూ.154.85 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఫండ్స్ రాగానే జమ చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారం రోజులుగా ఫండ్స్ రావడం లేదు. దీంతో వడ్ల పైసలు పెండింగ్లో ఉన్నాయి. 12 వేల మందికి రూ.154 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఫండ్స్ రాగానే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తాం.
- సోములు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్
డబ్బుల కోసం ఎదురుచూస్తున్నా
వడ్లు అమ్మి నెల రోజులైనా డబ్బులు అకౌంట్లో పడలేదు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగితే సివిల్ సప్లై జిల్లా మేనేజర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారు. ఎప్పుడు అడిగినా రేపు వస్తాయని చెబుతున్నారు. మా గ్రామంలోని సెంటర్లో గత నెల 3న 20 మంది రైతులు 1062 క్వింటాళ్ల వడ్లను అమ్మాం. రూ.22 లక్షలు డబ్బులు రావాలి.
- దమ్మాలపాటి రాంబాబు, విశ్వనాథపల్లి, కారేపల్లి మండలం
స్కూల్, కాలేజీ ఫీజులు కట్టాలి..
గ్రామంలోని సెంటర్లో డిసెంబర్ నెలలో 526 బస్తాల వడ్లు అమ్మాను. నెల రోజులు దాటినా డబ్బులు జమ కాలేదు. పిల్లలకు స్కూల్, కాలేజ్ ఫీజులు కట్టాలి. ఫర్టిలైజర్ షాపులో అప్పు తీర్చాలి. కౌలు డబ్బులు ఇయ్యాలి. ఆఫీసర్లు స్పందించి డబ్బులు జమ అయ్యేలా చూడాలి.
-మాగంటి వెంకటేశ్వర్లు, పాత మిట్టపల్లి