- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఘటన
వర్ధన్నపేట, వెలుగు : స్కూల్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రాందాన్‌తండాకు చెందిన గుగులోతు ధనుంజయ్‌కి ఇద్దరు కుమారులు, కుమారై నందిని (12) ఉన్నారు.
నందిని పర్వతగిరి మండలం తురకలసోమారంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన నందిని అప్పటి నుంచి స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంది. దీంతో స్కూల్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక గురువారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెదికినా ఆచూకీ దొరకలేదు.
ఈ క్రమంలో శుక్రవారం సమీపంలోని బావిలో బాలిక డెడ్‌బాడీని గమనించిన కొందరు వ్యక్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు