12 ఏళ్ల బాలుడు 60 ఏళ్ల దంపతులను దారుణంగా హతమార్చాడు. ఈ కేసు విచారణలో హత్యలు చేసింది ఓ బాలుడు అని తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో 60 ఏళ్ల ఇబ్రహీం అనే స్ర్కాప్ వ్యాపారి అతని భార్య హాజ్రాతో కలిసి ఉంటున్నాడు. వీరితో 12 ఏళ్ళ బాలుడు కొంత కాలంగా సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ క్రమంలో వారి దగ్గర చాలా డబ్బులు, బంగారం ఉంటాయని భావించిన బాలుడు.. తన స్నేహితులతో కలిసి వారి ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లాడు. అయితే ఆ వృద్ద దంపతులు ప్రతిఘటించడంతో అత్యంత దారుణంగా హతమార్చారు.
తరువాత అక్కడ దొరికిందంతా దోచుకొని పారిపోయారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు వృద్ధదంపతుల దోపిడీ, హత్య కేసులో ప్రధాన సూత్రధారి 12 ఏళ్ల బాలుడని గుర్తించారు. బాలుడితో పాటు మరో ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంకో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి రూ.12 వేలు, ఒక మొబైల్ ఫోన్, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.