12 ఏళ్ల కుర్రాడికి గుండెపోటు.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి

12 ఏళ్ల కుర్రాడికి గుండెపోటు.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి
  • సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఘటన

నారాయణ్ ఖేడ్  : గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడు నితిన్ మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఇందిరా కాలనీలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ఇందిర కాలనీలో నివసిస్తున్న జయమ్మ కుమారుడు నితిన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం నిద్ర లేచిన నితిన్ స్కూలుకు రెడీ అయి టీ బ్రెడ్ తో బ్రేక్ ఫాస్ట్ చేశాక శ్వాస సరిగ్గా రావట్లేదని తల్లితో చెప్పాడు.

వెంటనే నితిన్ ను దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా బాలుడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఒక్కసారిగా ఆ కుటుంబం ఉలిక్కిపడి కన్నీరు మున్నీరయ్యారు. ఎప్పుడు చురుగ్గా ఆరోగ్యంగా ఉండే కొడుకు సడన్ గా మృతి చెందడంతో ఆ తల్లి గుండెలు బాదుకుంది. ఆసుపత్రి ప్రాంగణం శోకసంద్రంలో మునిగిపోయింది. నితిన్ మృతి చెందడంతో ఇందిరా కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.