వీధి కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి మృతి

రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు చిన్నారులు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోగా.. లేటెస్ట్ గా జగిత్యాల జిల్లాలో మరో చిన్నారి వీధి కుక్కల దాడికి బలైంది. పదిహేను రోజుల క్రితం 12 ఏళ్ల చిన్నారి  కుక్కకాటుకు గురి కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. 

గొల్లపల్లి మండలం ఆత్మకూరుకు చెందిన 12 ఏళ్ల సంగెపు సాహిత్యకు 15 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళుతుండగా కుక్క దాడి చేసింది. ఆమెతో పాటు దాదాపు 10 మందిపై దాడికి పాల్పడింది.  తీవ్ర గాయాలైన చిన్నారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా ఈ రోజు మృతి చెందింది. సాహిత్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. దుబాయ్ లో ఉంటున్న బాలిక తండ్రి రాగానే అంత్యక్రియలు జరగనున్నాయి. కుక్కల బెడద కారణంగా చాల మందిపై దాడులు జరుగుతున్నాయని వాటి నివారణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.