దేశంలో ఏం జరుగుతుంది అనే కంటే.. అసలు మనం మనుషుల మధ్య ఉన్నామా.. మానవత్వమం అంటూ ఉందా అనే ప్రశ్నలు ఈ ఘటనతో తలెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఉజ్జయిని జిల్లా మహాకాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు.. ఇంట్లోనే అత్యాచారం చేశారు. బాలికను తీవ్రంగా వేధించారు. ఒంటిపై దుస్తులు చింపేశారు.. దుండగుల నుంచి తప్పించుకున్న బాలిక.. అర్థ నగ్నంగానే సాయం కోసం రోడ్డు వెంట పరుగులు తీసింది. అక్షరాల 2 గంటలపాటు.. ఎనిమిది కిలోమీటర్లు నడిచిన ఆ బాలికకు సాయం చేయటానికి స్థానికులు ఎవరూ ముందుకు రాకపోవటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. చిరిగిన దుస్తులతో.. తీవ్ర రక్త స్రావంతో.. ఒంటిపై గాయాలతో బాలిక రోడ్డుపై నడుస్తుంటూ.. అందరూ కళ్లప్పగించి చూశారు కానీ.. ఎవరూ సాయం చేయటానికి ముందు కాలేదు. కొందరు అయితే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
Also Read : కృష్ణ కృష్ణ : ఇస్కాన్ పై మేనకా గాంధీ సంచలన ఆరోపణలు
అత్యాచారం జరిగిన ప్రదేశం నుంచి బాలిక ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన తర్వాత.. ఉజ్జయినిలోని బద్ నగర్ ఏరియాలోని ఓ ఆశ్రమం దగ్గరకు చేసుకుంది. అక్కడ ఆశ్రమ పూజారి.. బాలిక పరిస్థితి చూసి చలించిపోయాడు. ఆమెకు దుస్తులు ఇచ్చి సాయం చేశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆ పూజారి. రంగంలోకి దిగిన పోలీసులు.. బాలికను ఇండోర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేస్తున్నారు.
ఈ ఘటనపై ఉజ్జయిని ఎస్పీ స్పందించారు. నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారాయన. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని.. బాలిక నుంచి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారాయన. బాలిక తల్లిపైనా దాడి జరిగినట్లు సమాచారం ఉందని.. దీనిపై ఎంక్వయిరీ నడుస్తుందని వివరించారు. బాలిక తన తల్లితో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ నుంచి వచ్చినట్లు చెప్పారు ఎస్పీ.
తీవ్ర రక్తగాయాలతో.. అర్థ నగ్నంగా రోడ్డుపై నడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోకపోవటంపై ఎస్పీ సచిన్ శర్మ సైతం ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వాళ్లకు ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని.. కనీసం పోలీసులకు అయినా సమాచారం ఇచ్చి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. వీడియోలు తీసిన వారిని గుర్తిస్తామని.. వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారాయన.
12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరగటమే దారుణం అయితే.. నడి రోడ్డుపై.. సాయం కోసం ఎనిమిది కిలోమీటర్లు.. రెండు గంటలు నడవటం అనేది ఇప్పుడు భయాందోళనలకు గురి చేస్తుంది.