కరోనా వైరస్ రోజు రోజుకీ భారీగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులు కూడా భారీగా వైరస్ బారినపడుతున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో గడిచిన రెండ్రోజుల్లో 120 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పటి వరకు ముంబై పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 2,028 మంది కరోనా బారినపడ్డారు. అందులో 290 మంది పోలీస్ ఆఫీసర్లు, 1,738 మంది పోలీస్‌మెన్ ఉన్నారని ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. మొత్తం కరోనా పేషెంట్లలో ఇప్పటికే 1,233 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. అయితే కరోనాతో పోరాడుతూ 22 మంది పోలీసులు మరణించారని తెలిపింది. ప్రస్తుతం 532 మంది పోలీసులు కోవిడ్ కేర్ సెంటర్లలో, 224 మంది ఇతర హాస్పిటల్స్‌లో, 33 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది.
ఇప్పటి వరకు దేశంలో దాదాపు 2 లక్షల 98 వేల మంది కరోనా బారినపడ్డారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన తర్వాత దాదాపు లక్షా 45 వేల మందికి పైగా కోలుకున్నారు. అయితే కరోనాతో పోరాడుతూ 8500 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం లక్షా 42 వేల మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 97,648 మందికి వైరస్ సోకింది. ఇప్పటికే 3,590 మంది ప్రాణాలు కోల్పోగా, 46 వేల మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 47,980 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క ముంబై సిటీలోనే సగానికి పైగా ఉన్నాయి. ముంబైలో ఇప్పటి వరకు 54,085 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 24 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ 1954 మంది ప్రాణాలు కోల్పోయారు.