టైంకి బ్లడ్ అందించాలని..
అయినోళ్లకి రక్తం ఇవ్వాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తరు కొందరు. అలాంటిది స్వార్థం హద్దులు చెరిపేసి... ఆపదలో ఉన్నోళ్లని వెతుక్కుంటూ వెళ్లి మరీ బ్లడ్ డొనేట్ చేస్తున్నాడు కిరణ్ వర్మ. బ్లడ్ డొనేషన్ పై అవేర్నెస్ కల్పించడానికి 21, 000 కిలోమీటర్ల జర్నీని కూడా మొదలు పెట్టాడు. ఇంతకుముందు కూడా ఇలా 16వేల కిలోమీటర్లు తిరిగాడు. ‘సింప్లీ బ్లడ్’ అనే వర్చు వల్ బ్లడ్ డొనేషన్ ప్లాట్‌ఫాంని క్రియేట్ చేసిన ఈ ఢిల్లీ అబ్బాయి ఈ పని మొదలుపెట్టింది ఇలా..
మన దేశంలో రోజుకి 12,000 మంది పేషెంట్స్‌కి టైంకి బ్లడ్ దొరకట్లేదు. దీనివల్ల ఏటా 40 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. 133 కోట్ల జనాభాలో కనీసం ఐదు కోట్లమంది రక్తదానానికి ముందుకొచ్చినా ఈ పరిస్థితి రాదు. ఈ విషయాన్నే అందరికీ చెప్పాలనుకున్నా. బ్లడ్ డొనేషన్‌పై అవేర్నెస్ కల్పించడానికే 16, 000 కిలోమీటర్లు తిరిగా. ఐదేండ్ల కిందట ‘సింప్లీ బ్లడ్’ అనే వర్చువల్ బ్లడ్ డొనేషన్ ప్లాట్‌ఫాంని క్రియేట్ చేశా. ఇప్పుడు 21వేల కిలోమీటర్ల టార్గెట్‌తో జర్నీ మొదలుపెట్టా. ఈ ఆలోచన వెనక ఉంది మాత్రం మా అమ్మ.
ఆలోచింపజేశాయి
టైంకి బ్లడ్ అందక మా అమ్మ చనిపోయింది. అప్పట్నించి మా కుటుంబానికి ఎదురైన పరిస్థితి మరొకరికి రావద్దని అవసరమున్న వాళ్లకి కాదనకుండా బ్లడ్ ఇస్తున్నా. సరిగ్గా ఐదేండ్ల కిందట తెలియని నెంబర్ నుంచి బ్లడ్ కావాలని నాకు ఫోన్ వచ్చింది. వెంటనే వెళ్లి రక్తం ఇచ్చా. కానీ, ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే బ్లడ్ అరేంజ్ చేసిన వ్యక్తి నేను డొనేట్ చేసిన బ్లడ్‌ని రూ. 1500కి ఒక పేద కుటుంబానికి అమ్మాడు. హాస్పిటల్, బ్లడ్‌కి డబ్బులు కట్టడానికి ఆ పేషెంట్ భార్య ప్రాస్టిట్యూషన్‌లోకి దిగింది. ఆ విషయం తెలిశాక చాలా రోజులు నిద్రపట్టలేదు. బ్లడ్ బ్లాక్ చెయిన్‌ని ఆపేందుకు ఏదైనా చేయాలనుకున్నా. ఆ ఆలోచనతోనే 2017 లో ‘సింప్లీ బ్లడ్’ అనే వర్చువల్ ప్లాట్‌ఫాంని క్రియేట్ చేశా. ప్రస్తుతం ఇందులో180 దేశాల నుంచి కొన్ని వేలమంది డోనర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు.
ఈ ఇన్సిడెంట్ తర్వాత క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లాడికి బ్లడ్ ఇచ్చా. కొద్దిరోజుల తర్వాత ఆ పిల్లాడు కోలుకున్నాడో లేదో తెలుసుకోవడానికి వాళ్ల ఇంటికి ఫోన్ చేశా. ప్లేట్లెట్ డోనర్ దొరక్క ఆ పిల్లాడు చనిపోయాడని చెప్పారు ఇంట్లోవాళ్లు. రెండు కోట్ల మంది ఉన్న ఢిల్లీలో ఒక్కరు కూడా ఆ పిల్లాడికి రక్తం ఇవ్వడానికి ముందుకు రాలేదన్న ఆలోచన నన్ను ఆలోచింపజేసింది. సొసైటీలో మార్పు తేవాలనుకున్నా. కానీ, చేతిలో సరిపడా డబ్బు లేదు. అయినా వెనకడుగేయలేదు. నా వంతు ప్రయత్నంగా అవేర్నెస్ కల్పించడానికి నడక మొదలుపెట్టా.
అదే నా టార్గెట్
జనవరి 26, 2018 లో శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో నా ప్రయాణం మొదలైంది. ఆ ఏడాది 16, 000 కిలోమీటర్లు ప్రయాణించా. వాటిల్లో ఆరువేల కిలోమీటర్లు కాలినడకన వెళ్లా. కాలేజీలు, యూనివర్సిటీలు, రెస్టారెంట్స్, మాల్స్, రైల్వే స్టేషన్స్, బస్టాండ్స్‌లో అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేశాడు. ప్రతి కిలోమీటర్‌కి కనీసం పదిమందిని రక్తదానానికి ఒప్పించాలన్న లక్ష్యంతో మొదలైన నా జర్నీ ఇప్పుడు 21, 000 కి.మీ టార్గెట్‌తో మళ్లీ మొదలైంది. డిసెంబర్ 31, 2025 నాటికి దేశ వ్యాప్తంగా రక్తం అందక ఎవరూ చనిపోకూడదనేదే నా ఆశయం. అందుకోసం మారుమూల ప్రాంతాల్లోనూ గల్లీగల్లీ తిరుగుతున్నా. దీంతో పాటు ఢిల్లీలో ‘వన్ మీల్’ అనే స్కీమ్‌ని కూడా మొదలుపెట్టా. దీని ద్వారా రూ. 10 రూపాయలకే పేదవాళ్లకు కడుపునిండా భోజనం పెడుతున్నా. ఫ్యూచర్లో ఈ సేవల్ని మరింత విస్తరించాలనుకుంటున్నా.