గచ్చిబౌలి, వెలుగు : మనీలాండరింగ్ పాల్పడ్డారని ఓ మహిళను ఐదు రోజుల పాటు డిజిటల్అరెస్ట్ చేసి, సైబర్ నేరగాళ్లు రూ. 1.22 కోట్లు కొట్టేశారు. కూకట్‌పల్లికి చెందిన 40 ఏళ్ల ఐటీ ఉద్యోగికి సెప్టెంబర్2న సైబర్ చీటర్స్ కాల్ చేశారు. తనను ఢిల్లీలోని ఆర్సీపురం పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ గౌరవ్ శుక్లాగా పరిచయం చేసుకొని ఆమెతో మాట్లాడారు. ఢిల్లీ హైకోర్టులో బాధితురాలి పేరుపై వివాదం ఉందని, ఆమె బ్యాంక్ అకౌంట్ల ద్వారా రూ. 25 లక్షలు మనీలాండరింగ్జరిగినట్లు భయపెట్టారు.
ఈ కేసును డీసీపీ రాజేశ్డియో పర్యక్షవేక్షిస్తున్నాడని చెప్పి, ఐదు రోజులు బాధితురాలిని ఆమె ఇంట్లోనే స్కైప్, వాట్సాప్ ద్వారా పర్యవేక్షిస్తూ డిజిటల్ అరెస్ట్ చేశారు. కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పిన అకౌంట్లకు డబ్బులు పంపాలని, రూ.1.22 కోట్లను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
వాటిని వెరిఫై చేసి తిరిగి పంపిస్తామని నమ్మబలికిన సైబర్ కేటుగాళ్లు.. ఆ తర్వాత స్పందించలేదు. దీంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహరాష్ట్ర పుణెకు చెందిన కపిల్కుమార్ను శనివారం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.