ఉమ్మడి ఖమ్మం జిల్లాలో .. 122 మంది ఫేక్​ డాక్టర్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో .. 122 మంది ఫేక్​ డాక్టర్లు
  • అర్హత లేకుండానే చికిత్స చేస్తున్నట్టు గుర్తింపు 
  • ఫస్ట్ ఎయిడ్ సెంటర్లముసుగులో ఆపరేషన్లు
  • విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ల వినియోగం
  • స్టేట్​మెడికల్ కౌన్సిల్, ఐఎంఏ దాడుల్లో వెల్లడి 

ఖమ్మం, వెలుగు :  ఎలాంటి అర్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లకు తెలంగాణ రాష్ట్ర మెడికల్​కౌన్సిల్ (టీజీఎంసీ) చెక్​పెట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్మిషన్లు లేకుండా, ఫస్ట్ ఎయిడ్​ సెంటర్ల ముసుగులో వైద్యం చేస్తున్న ఫేక్ ​డాక్టర్లకు సంబంధించిన క్లినిక్స్​పై దాడులు చేసింది. ఇప్పటి వరకు122 మంది ఎలాంటి అర్హత లేకుండానే వైద్యం చేస్తున్నారని ఆఫీసర్లు గుర్తించారు. ఇంకో 120 మంది ఫేక్​ డాక్టర్లున్నట్టు భావిస్తున్నారు. తాజాగా పలు మండలాల్లో తెలంగాణ రాష్ట్ర మెడికల్​కౌన్సిల్ (టీజీఎంసీ), ఇండియన్ ​మెడికల్ అసోసియేషన్ ​సభ్యులు తనిఖీలు నిర్వహించారు. 

30 మంది సభ్యులు10 టీమ్స్​గా ఏర్పడి తనిఖీలు చేశారు. ఇందులో ఆర్ఎంపీలు, పీఎంపీలుగా చలామణి అవుతూ, అర్హత లేకున్నా అన్ని రకాల వైద్య చికిత్స చేస్తున్నారని తేల్చారు. విచ్చలవిడిగా పేషెంట్లకు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్​ కిల్లర్స్ ​ఇస్తున్నారని, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల ముసుగులో ఆపరేషన్లు కూడా చేస్తున్నారని గుర్తించారు. సీక్రెట్ గా అబార్షన్లు, మోకాళ్ల నొప్పులకు స్టెరాయిడ్స్​ వినియోగిస్తూ, పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని నిర్ధారణకు వచ్చారు. 122 మందిపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.  

ఎక్కడెక్కడ తనిఖీలు..

ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి, తల్లాడ, వైరా, ఏన్కూరు, ముదిగొండ, జూలూరుపాడు, కల్లూరు, రఘునాథపాలెం, కామేపల్లి, కొత్తగూడెం, సుజాతనగర్, కారేపల్లి, ములకలపల్లి, టేకులపల్లి, ఇల్లెందులో ఈ టీమ్ లు తనిఖీలు చేశాయి. ఆర్ఎంపీ, పీఎంపీలుగా బోర్డులు పెట్టుకొని, ఎలాంటి మెడికల్ క్వాలిఫికేషన్లు లేకున్నా పేషెంట్లకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, పెయిన్ ​కిల్లర్లను ఇస్తున్నారని మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్, మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

 ఆర్ఎంపీ, పీఎంపీలు తమ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేసి, మిగిలిన ట్రీట్ మెంట్ కోసం సర్టిఫైడ్, ప్రొఫెషనల్​​డాక్టర్ల దగ్గరకు పంపాలి.. కానీ, ఆ రూల్స్​పాటించకపోగా ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు ఇవ్వడమే కాకుండా ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. పోర్టబుల్ స్కానర్లతో పుట్టబోయే బిడ్డ ఆడో, మగో చెప్పడంతో పాటు అబార్షన్లు కూడా చేస్తున్నారు. ఇదిలా వుండగా మనుషులకు ఇచ్చిన సిరంజిలను, సూదులను తిరిగి పశువులకు ఇంజెక్షన్ వేయడానికి వాడుతున్నట్టు తనిఖీల్లో తేలింది. దీని ద్వారా అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని మెడికల్ కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు.

కమిషన్లు ​ఇస్తున్రు..! 

ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ప్రైవేట్ దవాఖానాల మేనేజ్​మెంట్లు ఆర్ఎంపీలు, పీఎంపీలను కమిషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. నగరంలో ప్రధానంగా కొన్ని దవాఖానాల్లో ఏకంగా ఆర్ఎంపీలు తీసుకువచ్చిన పేషెంట్లకు సంబంధించిన బిల్లులో 50 శాతం ఆర్ఎంపీలకే కమిషన్​గా ఇస్తున్నారు.  ప్రొఫెషనల్ డాక్టర్ల ఆధ్వర్యంలో కాకుండా, మేనేజ్​ మెంట్ దవాఖానాల్లో ఈ వ్యవస్థ ఎక్కువగా పని చేస్తోంది. కొత్తగా ఎవరు దవాఖానా ప్రారంభించినా వ్యాపారం సక్సెస్​ కావాలంటే ఆర్​ఎంపీలతో లింక్​ తప్పనిసరి అయింది. వారిని ఆకట్టుకోవడం కోసం వారికి ఎక్కువ కమిషన్లు ఇస్తుండడంతో పేషెంట్ల ట్రీట్​మెంట్ కు అవసరమున్నా.. లేకున్నా ఎక్కువ పరీక్షలు చేయించడం, వారి నుంచి ఎక్కువ డబ్బులు గుంజడం కామన్​గా మారింది.

 అటు అధికారులు కూడా మామూళ్ల మత్తులో చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం, కంప్లయింట్స్​వచ్చినప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తుండడంతో ప్రైవేట్ దవాఖానాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అటు కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు కూడా ఇదే అదనుగా డబ్బులు దండుకుంటున్నారు. నేషనల్​  మెడికల్​కౌన్సిల్ చట్టం 2019 , సెక్షన్​ 34, 54 ప్రకారం అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తే రూ.5 లక్షల జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధించవచ్చని, తెలంగాణ రాష్ట్ర మెడికల్ ప్రాక్టిషనర్స్​రిజిస్ట్రేషన్​ యాక్ట్ 20, 22 ప్రకారం కూడా శిక్షార్హులు అవుతారని అధికారులు చెబుతున్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ జీవో నెంబర్​ 47, 48 ప్రకారం ఆస్పత్రులను రిజిస్ట్రేషన్​ తప్పనిసరిగా చేయించాలని సూచిస్తున్నారు.