ఒడిశాలో 123 అడుగుల శివుడి విగ్రహం ...మహాశివరాత్రి రోజున ఆవిష్కరణ

ఒడిశాలో 123 అడుగుల శివుడి విగ్రహం ...మహాశివరాత్రి రోజున ఆవిష్కరణ

సకల చరాచర జీవకోటికి ఆది ఆయనే.. అంతమూ ఆయనే. శివుడి ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదని పరమేశ్వరుడి భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ ముక్కంటి అనుగ్రహం కోసం నిత్యపూజలతో తరిస్తారు. బోళా శంకరుడి కృపకు పాత్రులు అయ్యేందుకు నిత్యం తపిస్తారు. అలాంటిది..  మహాశివరాత్రి రోజు శివ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు.  ఆరోజున ఒడిశాలోని జైపూర్ జిల్లా  బ‌ర‌హ‌నాథ్ టెంపుల్ సమీపంలో123 అడుగుల శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 

 ఒడిశాలోని జైపూర్ జిల్లాలో 123 అడుగుల ఎత్తులో శివుడు కొలువుదీరాడు. ఈ విగ్రహాన్ని మార్చి 8వ తేదీన మ‌హాశివ‌రాత్రి ప‌ర్వదినాన్ని పుర‌స్కరించుకొని ఆవిష్కరించ‌నున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శివుడి విగ్రహాన్ని బైత‌రాని న‌దీ తీరంలోని బ‌ర‌హ‌నాథ్ టెంపుల్ స‌మీపంలో ఏర్పాటు చేశారు. బ‌ర‌హ ఖేత్ర డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో విగ్రహాన్ని నిర్మించారు.

ఇక శివుడిని ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు అధికారులు అన్ని ర‌కాల సౌక‌ర్యాలు ఏర్పాటు చేశారు. లిఫ్టులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్లి శివుడిని ద‌ర్శించుకోవ‌చ్చు. శివుడి విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన ఓ ప్రయివేటు ఆర్ట్ ఆర్గనైజేష‌న్ సంస్థ నిర్మించింది.

విగ్రహాంతో పాటు అక్కడ పార్కు కూడా ఏర్పాటు చేశారు. టూరిస్టుల‌కు, భ‌క్తుల‌కు ఆహ్లాదం క‌లిగించేలా వాట‌ర్ ఫౌంటెన్స్‌ను నిర్మించారు. భ‌క్తుల కోసం విశ్రాంతి గ‌దుల‌ను కూడా నిర్మించారు. జైపూర్ జిల్లా ప‌ర్యాట‌కానికి ప్రసిద్ధి. ద‌శ్వమేధ ఘాట్, బ‌ర‌హా టెంపుల్, బరుణి ఘాట్, మా బైరాజా టెంపుల్స్ ను కూడా భ‌క్తులు, ప‌ర్యాట‌కులు సంద‌ర్శించొచ్చు.

సాధారణంగా శివాలయాల్లో ఆ ఆదిదేవుని విగ్రహాల ఎత్తు మామూలుగానే ఉంటుంది. కానీ.. తలెత్తి చూసేంత భారీ ఎత్తైన శివుడి విగ్రహాలను కనులారా వీక్షించినప్పుడు.. శివ భక్తుల్లో సంతోషం ఎంత ఉప్పొంగుతుందో కదా... మరి ఇప్పుడు అలాంటి శివుడి విగ్రహం 123 అడుగుల ఎత్తుతో ఒడిశాలో మహా పర్వదినమైన శివరాత్రి రోజు ఆవిష్కృతంకానుంది.