ఖమ్మం, వెలుగు: ఎంపీ నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.124.80 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనిలో భాగంగా ఖమ్మం– కురవి జాతీయ రహదారి(ఎన్ హెచ్365ఏ)తోపాటు పెద్ద తండా జంక్షన్ నుంచి పల్లెగూడెం వరకు నాలుగు లైన్ల విస్తరణ, డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పల్లెగూడెం నుంచి ఎం. వెంకటాయపాలెం వరకు ఉన్న రోడ్డు విస్తరణ, బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు భద్రతా చర్యలు తీసుకునేందుకు మొదటి ప్యాకేజీ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.57.52 కోట్లకు మంజూరు ఇస్తూ ఆదేశాలు జారీ చేసిందని ఎంపీ నామా నాగేశ్వరరావు సోమవారం తెలిపారు.
రెండో ప్యాకేజీలో వెంకటగిరి క్రాస్ రోడ్డు నుంచి కోదాడ క్రాస్ రోడ్డు వరకు, ఏదులాపురం జంక్షన్ నుంచి పెద్ద తండా జంక్షన్ వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించడంతో పాటు డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు అనుమతినిస్తూ రూ.67.28 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఇదే జాతీయ రహదారికి సంబంధించి మరో రెండు చోట్ల ప్రతిపాదించిన పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఈ నిధులతో చేపట్టే పనులతో ఆయా గ్రామాలు, ప్రాంతాలు అభివృద్ధి సాధించడంతోపాటు ప్రజలు ఆర్థికంగా మెరుగుపడతారని ఆయన పేర్కొన్నారు.