- ఏకగ్రీవ తీర్మానం చేసిన అసెంబ్లీ
- పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఎందుకు తీసేశారు: భట్టి
- పర్మిషన్ తీసుకోలేదని తొలగించాం: కేటీఆర్
హైదరాబాద్ : కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌కు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మంగళవారం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మంత్రి కేటీఆర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. పార్లమెంట్‌కు పేరు పెట్టడానికి బీఆర్ అంబేద్కర్ కు మించిన వ్యక్తి లేడని ఆయన అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. పురుషులతో మహిళలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం ఉండాలని అంబేద్కర్ కోరుకున్నారని గుర్తు చేశారు. ఒక వర్గానికి, ప్రాంతానికి, కులానికి ఆయన్ను పరిమితం చేయొద్దని, ఆయన అందరి వ్యక్తి అని అన్నారు. ఆయన మార్గదర్శకంలో టీఆర్ ఎస్ పనిచేస్తోందన్నారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం సముచితమని, కేంద్రానికి ప్రతిపాదనను చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుందని కేటీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎల్పీ మీటింగ్‌లో చర్చించి, ఆ ప్రతిపాదననను సోమవారం సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. తమ ప్రతిపాదనను అంగీకరించి తీర్మానం చేస్తున్నందుకు భట్టి ధన్యవాదాలు తెలిపారు. అయితే, పంజాగుట్ట సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే, ఆ విగ్రహాన్ని తొలగించి పోలీస్ గ్రౌండ్‌లోని సైకిల్ స్టాండ్ లో ఉంచారని భట్టి గుర్తు చేశారు. ఆ విగ్రహాన్ని తెప్పించి అక్కడ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని భట్టి కోరారు.
జనవరిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రారంభిస్తం
అంబేద్కర్ ను గౌరవించటం అంటే మనని మనం గౌరవించుకోవడం అని మంత్రి కేటీఆర్ అన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్‌కు విరుద్ధంగా, అధికారుల అనుమతి తీసుకోకుండా పంజాగుట్టలో విగ్రహం ఏర్పాటు చేసినందున విగ్రహాన్ని తొలగించారని తెలిపారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఐమాక్స్ పక్కన తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపాదన మేరకు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే జనవరిలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ తీర్మానంపై బీజేపీ ఎమ్మెల్యే కూడా మాట్లాడితే బాగుండేదని, కానీ ఆయన సభ నుంచి బయటకు ఎందుకు వెళ్లారో తెలియదన్నారు. ఆయనకు ఇష్టం లేదేమోనన్నారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టే తీర్మానానికి తమ పార్టీ మద్దతు తెలుపుతుందని ఎంఐఎం ప్రకటించింది. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.