హైదరాబాద్లో 125 హాట్ స్పాట్లు

హైదరాబాద్లో 125  హాట్ స్పాట్లు
  •     వాననీరు నిలిచే ప్రాంతాల్లోని మ్యాన్ హోల్స్ కు రెడ్ కలర్ 
  •     మొత్తం 5.76 లక్షల్లో 39,678 డీప్ హోల్స్ గా గుర్తించాం
  •     వీటికి రెడ్ మార్క్ చేయడంతో పాటు గ్రిల్స్ అమర్చాం 
  •     హెడ్ ఆఫీసు, డివిజన్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ లు 
  •     డివిజన్ కు 5 మందితో ఒక ఎమర్జెన్సీ టీమ్ ఏర్పాటు 
  •     వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి మీడియా చిట్ చాట్

హైదరాబాద్, వెలుగు :  మాన్  సూన్  ఇబ్బందులను ఎదుర్కొనేందుకు వాటర్ బోర్డు సిద్ధమైంది.  గత ఇబ్బందుల  దృష్ట్యా ఈసారి పకడ్బందీగా చర్యలు తీసుకుంది.  ఖైరతాబాద్ లోని వాటర్ బోర్డు హెడ్ ఆఫీసులో ఎండీ సుదర్శన్ రెడ్డి శుక్రవారం మీడియాతో చిట్ చాట్  నిర్వహించారు. సిటీలో  125 వాటర్ హాట్ స్పాట్లను గుర్తించామని, ఆయా చోట్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బోర్డు పరిధిలో 5. 76 లక్షల మ్యాన్ హోల్స్ ఉండగా, ఇందులో 39,678 డీప్ హోల్స్ గుర్తించామని వివరించారు.

  వీటిపై సేఫ్టీ గ్రిల్స్ అమర్చడంతో పాటు  ప్రజలు ఈజీగా గుర్తించేందుకు ఎరుపురంగు వేసినట్లు  తెలిపారు.  ఆయా రూట్లలో  తిరిగే వారు వాటిని ఈజీగా గుర్తిస్తారన్నారు. వర్షాలు పడ్డప్పుడు మ్యాన్ హోళ్లలో పడకుండా ప్రజలను అలర్ట్ చేసే చాన్స్ కూడా ఉంటుందన్నారు. ఆ మ్యాన్ హోల్ మూతలు తెరిచినా కూడా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవన్నారు. అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు. 

ఎవరైనా అక్రమంగా మ్యాన్ హోల్స్ ను  తెరిస్తే వాటర్ బోర్డు చట్టం- –1989 సెక్షన్ 74 మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు.  ఎవరైనా రెడ్ కలర్ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎర్రరంగు  మ్యాన్ హోల్స్ వద్దకు వెళ్లడం, ముట్టుకోవడం చేయొద్దని సూచించారు. 

సీసీ కెమెరాలతో వరద నీటి ప్రాంతాల గుర్తింపు 

వాటర్ బోర్డు పరిధిలోని16 డివిజన్లలో ఒక్కో డివిజన్ కు ఒక ఎమర్జెన్సీ టీమ్ ని ఏర్పాటు చేశామన్నారు. టీమ్ లో 5 మంది ఉంటారన్నారు. అన్ని డివిజన్ల ఆఫీసులతో పాటు హెడ్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే 155313 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా కూడా వరదనీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించేందుకు నిర్ణయించినట్లు, పోలీసు శాఖ పర్మిషన్ తీసుకుంటామన్నారు. బోర్డుకు అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీతో పాటు పోలీస్ కమాండ్ కంట్రోల్ లోనూ వాటర్ బోర్డు సిబ్బంది ఉంటారన్నారు. 

షిఫ్ట్ ల వారీగా ఎయిర్ టెక్ మెషీన్లు 

220 ఎయిర్ టెక్ మెషీన్లు ఉన్నాయని, వీటిని షిఫ్ట్ ల వారీగా 24 గంటల పాటు అందుబాటులో ఉంచుతామన్నారు.  వర్షాకాలంలో నీటి కాలుష్యం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామన్నారు.  ప్రస్తుతం రోజుకు 4వేల వాటర్ శాంపిల్స్ సేకరించి టెస్టులు చేస్తున్నామన్నారు. వాటర్ బోర్డుకు నెలకు నెలకు రూ.130 కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఇందులో రూ.70 కోట్లు జీతాలకు పోతుండగా.. మిగతాది వివిధ పనులకు ఖర్చు చేస్తున్నామన్నారు. 

ఇయ్యాల్టి నుంచి డయల్ యువర్ ఎండీ 

వినియోగదారుల నుంచి నేరుగా స‌‌మ‌‌స్యలను తెలుసుకునేందుకు వాటర్ బోర్డు డ‌‌య‌‌ల్ యువ‌‌ర్ ఎండీ ప్రోగ్రామ్ ను కూడా ప్రారంభించనుంది. కొవిడ్ కారణంగా నిలిచిపోగా తిరిగి ఖైర‌‌తాబాద్ హెడ్ ఆఫీసులో శనివారం నుంచి కొనసాగించనుంది. ప్రతి15 రోజులకు ఒకసారి ప్రోగామ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంట‌‌ల వ‌‌ర‌‌కు నీటి సమస్యలపై ఎండీ దృష్టికి తీసుకురావచ్చు. 

040-– 23442881 లేదా 23442882 లేదా 23442883 నంబర్లకు ఫోన్ చేసి తెలపవచ్చు.  వినియోగదారుడి క్యాన్ నంబరుతో పాటు ఇంటి నంబ‌‌రు చెప్పి ఫిర్యాదులు చేయవచ్చు. త్వరలోనే మీట్ యువ‌‌ర్ ఎండీ కూడా ప్రారంభం కానుంది. అదేవిధంగా స్థానిక ఓఅండ్ఎం డివిజ‌‌న్ జ‌‌న‌‌ర‌‌ల్ మేనేజ‌‌ర్ ఆఫీసులో ప్రజావాణి తిరిగి ప్రారంభం కానుంది. వచ్చే సోమవారం నుంచి స్టార్ట్ చేయనున్నట్టు ఎండీ సుద‌‌ర్శన్ రెడ్డి తెలిపారు. తాగునీరు, మురుగు నీటి నిర్వహ‌‌ణ, బిల్లింగ్, రెవెన్యూ, ఇత‌‌ర స‌‌మ‌‌స్యలపై ఫిర్యాదులు చేయొచ్చని సూచించారు. 

మరో 39 ఎస్టీపీలు 

మూసీ బ్యూటిఫికేషన్,  డెవలప్ మెంట్ తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. పనులు కూడా స్టార్ట్‌‌ అయ్యాయి. మూసీ ప్రక్షాళనలో భాగంగా రూ. 3,784 కోట్ల అంచనాతో 965 ఎంఎల్‌‌డీల సామర్థ్యంతో మరో 39 ఎస్టీపీలను వాటర్ బోర్డు నిర్మించనుంది. అటల్‌‌ మిషన్‌‌ ఫర్‌‌ రెనోనేషన్‌‌ అండ్‌‌ అర్బన్ ట్రాన్స్‌‌ఫర్మేషన్‌‌(అమృత్‌‌) స్కీమ్ కింద కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 39 ఎస్టీపీల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 

అమృత్‌‌ స్కీమ్ లో భాగంగా ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25 శాతం కేంద్రం, 35 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా, 40 శాతం ఏజెన్సీ వాటా చొప్పున హెచ్‌‌ఏఎం మోడ్‌‌లో ప్రాజెక్టు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలోని ప్రాజెక్టులకు త్వరలోనే పరిపాలన అనుమతులు రానున్నాయి.