- నిజాంసాగర్ మండలంలో అత్యధికం
- ఎల్లారెడ్డి మండలంలో నిల్
కామారెడ్డి, వెలుగు : ఇటీవల పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా కుక్కల దాడులు పెచ్చరిల్లుతున్నాయి. అనేక కారణాలతో కుక్కల సంఖ్య గత రెండేళ్లుగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో మూకుమ్మడిగా కుక్కలే దాడులు చేస్తుండగా చాలామంది ముఖ్యంగా ముసలివాళ్లు, పిల్లలు తీవ్రంగా గాయపడుతున్నారు. దీంతో అధికారులు కుక్కల నియంత్రణమీద దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా అసలు కుక్కలు ఎన్ని ఉన్నాయే అన్న లెక్కలు తేల్చారు.
ప్రభుత్వం ఈ నెల 5 నుంచి 9 వరకు స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు అన్ని చోట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఏ గ్రామంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో కూడా సర్వే చేశారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న మొత్తం 526 గ్రామ పంచాయతీల్లో 12 ,606 కుక్కలు ఉన్నట్లు సర్వేలో తేల్చారు.
మండలాల వారీగా ఇదీ లెక్క
మండలాల వారీగా అధికారులు కుక్కల వివరాలను సేకరించి .. దాడులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోనున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలంలో అత్యధికంగా 1,890 కుక్కలుండగా.. ఎల్లారెడ్డి మండలంలో అసలు కుక్కలే లేవని సర్వే వెల్లడిస్తోంది. బాన్స్వాడ మండలంలో 320, బిచ్కుందలో 55, బీర్కుర్‌లో 301, జుక్కల్‌లో 1,149, మద్నూర్‌లో 1,602,
నస్రుల్లాబాద్‌లో 263, పెద్దకొడప్గల్లో 729, పిట్లంలో 575, భిక్కనూరులో 199, బీబీపేటలో 318, దోమకొండలో 556, కామారెడ్డిలో 392, మాచారెడ్డిలో 766, రాజంపేటలో 334, రామారెడ్డిలో 1,498, సదాశివనగర్‌లో 1,059, తాడ్వాయిలో 107, గాంధారిలో 22, లింగంపేటలో 35, నాగిరెడ్డిపేటలో 433 కుక్కలు ఉన్నాయి.
దాడిలో వృద్దురాలు మృతి
జిల్లాలో ఇటీవల కుక్కల దాడులు పెరిగాయి. భిక్కనూరు, తాడ్వాయి, రాజంపేట, మాచారెడ్డి, కామారెడ్డి తదితర ఏరియాల్లో కుక్కలు చెలరేగిపోయాయి. ఈ దాడుల్లో చాలామంది గాయపడ్డారు. కొంతకాలం కిందట మాచారెడ్డి మండలం లచ్చాపేటలో దాడి చేయగా తీవ్రంగా గాయపడా ఓ వృద్ధురాలు చనిపోయింది. అయినా గ్రామాల్లో కుక్కలను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
పట్టణాల్లోనే కుక్కల బర్త్ కంట్రోల్ ప్రక్రియకు అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. గ్రామాల్లో అయితే ఆ దిశగా అధికారులు ఆలోచన కూడా చేయలేదు. పట్టణాలతో పాటు కుక్కల బెడద ఎక్కువగా ఉన్న గ్రామాల్లో కుక్కల బర్త్ కంట్రోల్‌కు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.