- మూడు జిల్లాల్లో కలిపి 72.44 శాతమే పోలింగ్
- గత ఎన్నికతో పోలిస్తే 4 శాతం తక్కువ
- గ్రామాలు, చిన్న పట్టణాల్లోనే ఎక్కువ పోలింగ్
- ఓటింగ్ ఆసక్తి చూపని పెద్ద పట్టణాల ఓటర్లు
- గెలుపోటములపై ప్రభావం చూపుతుందంటున్న లీడర్లు
నల్గొండ, వెలుగు : ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు సైతం బద్దకించారు. ఓటరుగా నమోదు చేసుకోవడంలో చూపిస్తున్న ఆసక్తి పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసేందుకు మాత్రం చూపడం లేదు. మూడు రోజుల కింద జరిగిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉపఎన్నికల్లో ఏకంగా 1,27,828 మంది గ్రాడ్యుయేట్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటు ప్రాధాన్యంపై రాజకీయ పార్టీలు, ఎన్నికల ఆఫీసర్లు ఎంత అవగాహన కల్పించినా విద్యావంతులు సైతం ఓటుకు దూరంగా ఉండడానికి కారణమేమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
1.27 లక్షల మంది ఓటేయలే..
వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. కానీ ఈ నెల 27న జరిగిన ఎన్నికకు మాత్రం 3,36,013 మంది ఓటర్లే హాజరై ఓటుహక్కును వినియోగించుకున్నారు. 1,27, 826 మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మూడు జిల్లాల్లో కలిపి 72.44 శాతం పోలింగ్ నమోదు అయింది. 2021లో ఇదే స్థానానికి జరిగిన ఎన్నికల్లో 5.05 లక్షల మంది ఓటర్లు ఉండగా అప్పుడు 3,66,333 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 76 గా నమోదైంది. మూడేళ్లలోనే పోలింగ్ పర్సంటేజీ 4 శాతం తగ్గడం గమనార్హం.
గెలుపోటములపై ప్రభావం
రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన గ్రాడ్యుయేట్ ఎన్నికలు పూర్తిగా రాజకీయంగా మారిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బలపరిచిన క్యాండిడేట్లతో పాటు రిజిస్టర్డ్ పార్టీలు, ఇండిపెండెంట్లతో కలిపి మొత్తం 52 మంది పోటీ చేశారు. పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్ల తరఫున ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు జోరుగా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కానీ లక్షల మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపనుందని క్యాండిడేట్లు, ఆయా పార్టీల లీడర్లు ఆందోళన చెందుతున్నారు.
పల్లెల్లో పెరిగిన పోలింగ్
గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో మొత్తం పోలైన 3.36 లక్షల మంది ఓటర్లలో 2,12,447 మంది పురుషులు, 1,23,564 మంది మహిళలు ఓటు వేశారు. 75,742 మంది పురుషులు, 52,081 మంది మహిళలు తమ ఓటు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇద్దరి మధ్య తేడా కేవలం 3 శాతమే. మేజర్ పట్టణాలతో పోలిస్తే చిన్న పట్టణాలు, పల్లెల్లోనే ఓటింగ్ శాతం భారీగా నమోదైంది. వాస్తవానికి మేజర్ పట్టణాల్లోనే ఎక్కు మంది ఓటర్లు ఉంటారు. గ్రామాలు, చిన్న మున్సిపాలిటీల్లో ఓటర్లు తక్కువ. కాబట్టి పోలింగ్ పల్లెల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆఫీసర్లు అంటున్నారు. దీన్ని బట్టి పరిశీలిస్తే పట్టణాల్లోనే ఓటర్లు పోలింగ్‌కు రాలేదని భావిస్తున్నారు. సెలవు దినం లేకపోవడంతో పాటు, ఉద్యోగాల కోసం వివిధ ప్లేస్‌లలో ఉంటున్నవారు, ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న వారు పోలింగ్‌కు రాలేదని భావిస్తున్నారు.
జిల్లాల వారీగా నమోదైన ఓట్లు
జిల్లా మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం
సిద్దిపేట 4,679 3,570 76.13
జనగామ 23,419 17,878 76.34
హనుమకొండ 43,729 31,681 72.45
వరంగల్ 43,812 31,842 72.68
మహబూబాబాద్ 34,933 25,204 72.15
ములుగు 10,299 7,636 74.58
భూపాలపల్లి 12,535 9,228 73.62
భద్రాద్రి కొత్తగూడెం 40,106 28,054 69.95
ఖమ్మం 83,879 56,719 67.62
యాదాద్రి భువనగిరి 34,080 26,784 78.59
నల్గొండ 80,871 59,271 73.29
సూర్యాపేట 51,479 37,671 73.15