ప్రస్తుత రోజుల్లో మూడు పదులు వచ్చాయంటే చాలు.. ఆపసోపాలు పడుతుంటారు.. కూర్చుంటే లేవలేరు.. లేస్తే కూర్చోలేరు. అయితే ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద వయస్సు గల వ్యక్తి 127 ఏళ్ల వ్యక్తి జోస్ పాలినో గోమ్స్ కన్నుమూశారు. బ్రెజిల్ దేశానికి చెందిన గోమ్స్ ప్రస్తుతం మినాస్ గెరాయిస్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఆయన వద్దాప్య భారంతో మరణించారని కుటుంబసభ్యులు వెల్లడించారు. గోమ్స్ మూడు పాండమిక్‌లు, రెండు ప్రపంచ యుద్ధాలు చూశాడు, ఆయనకు ఏడుగురు సంతానం 25మంది మనవలు, 42మంది మునిమనవులు, 11మంది ముని ముని మనవులు ఉన్నారు.
కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతన్న గోమ్స్ (127) కు కొన్ని అవయవాలు పనిచేయడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. గోమ్స్ వివాహం 1917లో అయింది. ఆయన వివాహ ధృవీకరణ పత్రంలో పుట్టిన తేదీ ఆగస్టు 4, 1895గా పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ( వార్త రాసే రోజుకు) 128వ వ సంవత్సరంలో అడుగుపెట్టడానికి ముందు వారం రోజుల ముందు మరణించారు.
గోమ్స్ వయసు విషయంలో కుటుంబసభ్యులే కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ తాత గారి వయసు 110 నుంచి 120 మధ్య ఉండొచ్చని మనవరాలు ఎలైన్ ఫెరేరా అభిప్రాయ పడ్డారు. పురాతన డాక్యుమెంట్లలో తప్పులు ఉండే అవకాశం ఉందని .. అధికారులు దర్యాప్తు చేసి తమ తాతగారి వయస్సును నిర్దరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. గోమ్స్ నాలుగేళ్ల క్రితం వరకు గుర్రపు స్వారీ చేసే వారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన చాలా సాధారణంగా, సౌమ్యంగా ఉండే వారు. సహజమైన, దేశీయ ఉత్పత్తులనే వాడే వారని.. పారిశ్రామిక ఉత్పత్తులు అంటే చిరాకు పడేవారని కుటుంబసభ్యులు తెలిపారు. కోళ్లు, పందులను పెంచుకుంటూ.. మితంగా ఆల్కహాల్ తీసుకుంటూ గడపడం ఆయనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. అయితే ఆయన 1900 కంటే ముందే జన్మించారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆయన యువకుడిగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసని ఆయన నివసించే వీధిలో ఉంటున్న 98 ఏళ్ల బామ్మ పేర్కొన్నారు. ఈయన వయసుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తించిందా లేదా అనే అంశంలో ఇంకా స్పష్టత రాలేదు. 116 ఏళ్ల మారియా బ్రాన్యాస్ మోరర్‌ను జీవించి ఉన్న అతి పెద్ద వయస్కురాలిగా గిన్నిస్ బుక్ గుర్తించింది. తాజాగా వెనిజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటేను సైతం పరిగణనలోకి తీసుకుంది.