
- ఎన్నికల ఖర్చు చూపని అభ్యర్థులపై ఈసీ కొరఢా
- 12,745 మందిపై చర్యలు
- మూడేండ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం
హైదరాబాద్, వెలుగు:ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చు చూపని వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం వేటు వేసిం ది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 12,745 మంది నేతలపై మూడేండ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఇందులో ఉన్నారు. వారంతా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. జిల్లా, మండలాల వారీగా వీరి లెక్కలు తయారు చేశారు. వీరంతా 2021 జనవరి 23 వరకు ఏ ఎన్నికల్లోనూ పాల్గొనకూడదు.
నోటీసులిచ్చినా స్పందించలేదు
ఎన్నికల లెక్కలు చూపని వారికి ఎన్నికల సంఘం పలుమార్లు నోటీసులిచ్చిం ది. 2018 జనవరి వరకు సమయం ఇచ్చారు . అయినా గెలిచిన, ఓడిన అభ్యర్థులెవరూ ఈ అంశాన్ని పట్టించుకోలేదు. గెలిచిన వారిపై ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది.
పరిషత్ ఎన్నికల్లో 1,642 మంది
311 మంది జడ్పీటీసీ, 1,331 మంది ఎంపీటీసీ అభ్యర్థులు కలిపి మొత్తం 1,642 మందిపై ఎన్నికల్లో పోటీ చేయకుండా మూడేండ్ల నిషేధం వేటు పండింది.2013లో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసినవారిలో11,102 మందిని ఎన్నికల్లో పోటీకి దూరం చేశారు. వీరిలో 9 మంది సర్పంచ్ లుగా, 1300 మంది వార్డు సభ్యులు గెలిచినవారున్నారు. 1,265 మంది సర్పంచ్ అభ్యర్థులు, 8528 మంది వార్డు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన వారున్నారు.