- వరద బాధితులు ఆందోళన చెందొద్దు
- ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీజ
ఖమ్మం టౌన్,వెలుగు : వరదల్లో సర్టిఫికెట్స్ పోగొట్టుకున్నవారికి మూడు వారాల్లో కొత్త సర్టిఫికెట్ల జారీ చేసేందుకు కృషి చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దని అడిషనల్కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. బుధవారం ముంపు బాధితులు కోల్పోయిన సర్టిఫికెట్ల జారీ, పాఠశాల విద్యలో తీసుకుంటున్న చర్యలపై కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. వరదల కారణంగా దెబ్బతిన ఇండ్లలో బాధితులు కోల్పోయిన సర్టిఫికెట్ల జారీకి ప్రణాళికాబద్ధ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
సర్వే ఆధారంగా ఇప్పటి వరకు పదవ తరగతి సర్టిఫికెట్ల కోసం 680, ఇంటర్ 454, డిగ్రీ, బీటెక్ సంబంధించి 94, పీజీ 47, పాస్ పోర్ట్ కోసం 29 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. రెవెన్యూకు సంబంధించి ఆదాయ సర్టిఫికెట్లు 269, కుల ధ్రువీకరణ పత్రాలు 376, నివాస ధ్రువీకరణ పత్రాలు 189, ఓబీసీ సర్టిఫికెట్లు 77, పాస్ పుస్తకాలు 88, ఆధార్ కార్డు 388, రేషన్ కార్డు 182 కోల్పోయినట్లు దరఖాస్తులు వచ్చాయన్నారు.
గర్ల్స్ కు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్
జిల్లాలోని 237 ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ అందించేందుకు వారానికి మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, దీనికోసం 120 మంది మాస్టర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ప్రతి బుధవారం జిల్లా అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించి మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి పలు సూచనలు చేస్తున్నారని చెప్పారు. ప్రతినెలా ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగుతోందన్నారు.
జిల్లాలోని 50 పాఠశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్ లను ఏర్పాటు చేశామని, దశల వారీగా జిల్లా వ్యాప్తంగా ఈ ల్యాబ్ లను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే నెల 2 నుంచి 9 వరకు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయని, ఇందులో బాల్య వివాహాలు నిర్మూలన కోసం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి బతుకమ్మలో 1098 హెల్ప్ లైన్ నంబర్ ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలు హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ల ఆధ్వర్యంలో జరగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇంగ్లిష్ పరిజ్ఞానం కోసం ప్రత్యేక కోర్సు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికీ ఇంగ్లిష్పరిజ్ఞానం అందించేలా ప్రత్యేక కోర్సు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6వ, 7వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ కోర్సు అమలుపై కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లోఅధికారులతో ఆమె సమీక్షించారు. ముందస్తుగా 16 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసుకుని, అందులో ఉన్న ఇంట్రాక్టివ్ ప్యానల్స్ ద్వారా ఆడియో, వీడియో వినియోగిస్తూ పిల్లల్లో ఆంగ్ల భాష పరిజ్ఞానం పెరిగేలా రోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు.