జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాదుల లిఫ్ట్‌స్కీం పూర్తి చేయడానికి మరో 1,279 కోట్లు కావాలని ప్రాజెక్టు ఇంజినీర్లు తాజాగా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. సర్కారు గనక ఆమోదిస్తే మూడోసారి అంచనా వ్యయం పెరిగినట్లవుతుంది. గత 18 ఏండ్లలో ప్రాజెక్టు ఖర్చు ఏకంగా 122 శాతం మేర పెరిగింది. కాంట్రాక్టర్లకు ఉపయోగపడే పనులను మాత్రమే చేస్తూ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలను పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు లక్ష్యం నెరవేరడం లేదు. 60 టీంఎంసీలకు కేవలం 8 టీఎంసీలను మించి వాడుకోలేని పరిస్థితి ఉండడంతో ఆయకట్టు రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
మూడోసారి పెరిగిన అంచనా వ్యయం!
మొదట 2004 సంవత్సరంలో రూ.6016 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ పనులను పూర్తిచేయాలని ఇంజినీర్లు భావించారు. 2010 నాటికి ఇది రూ.9427.73 కోట్లకు, తర్వాత 2016 నాటికి రూ.13,445.44 కోట్లకు పెరిగింది. అయినా పనులు పూర్తి కాకపోవడంతో తాజాగా అంచనా వ్యయాన్ని రూ.14,729 కోట్లకు పెంచారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆఫీసర్లు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దేవాదుల మొదటి దశ పనులు 2005లోనే పూర్తి కావాల్సి ఉంది. గడువు దాటి 17 ఏండ్లవుతున్నా ప్యాకేజీ 45, ప్యాకేజీ 46 పనులు కూడా పూర్తి కాలేదు. రెండో దశ పనులు కూడా 2007 నాటికే పూర్తి చేయాల్సి ఉండగా 15 ఏండ్లయినా ఆశ్వరావుపల్లి, చీటకోడూరు డిస్ట్రిబ్యూటరీ పనులు 50 శాతం కూడా కంప్లీట్ కాలేదు. ఇక మూడో దశ పనుల సంగతి చెప్పరాకుండా ఉంది. అత్యంత ప్రధానమైన సొరంగ నిర్మాణ పనులు పూర్తి చేయలేదు. గడువు దాటినా 8 ప్యాకేజీల కింద జరుగుతున్న పనులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. పనులు పూర్తికాకపోవడంతో అధికారులు గడువు(ఈవోటీ) పెంచుకుంటూ పోతున్నారు. ఏఐబీపీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కూడా ఇంజినీరింగ్ పనుల కోసం సాయమందిస్తోంది. ప్రతీయేటా ఖర్చుచేసిన మొత్తంలో 25 శాతం నిధులను సమకూరుస్తోంది. ప్రాజెక్ట్‌లో 32,750 ఎకరాలను సేకరించాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 29,694 ఎకరాలు మాత్రమే సేకరించారు.
రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లయినా..
ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫస్ట్ ప్రతీ ఏటా 38 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేయాలని భావించినా స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తుపాకుల గూడెం బ్యారేజీ నిర్మాణంతో వాటర్ లిఫ్ట్ చేసే సామర్థ్యాన్ని 60 టీఎంసీలకు పెంచారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు దాటినా పనులు పూర్తిచేయలేకపోవడంతో ఏటా 8 టీఎంసీల నీళ్లను మాత్రమే లిఫ్ట్ చేసి ఉపయోగించుకోవాల్సి వస్తోంది. దీంతో దేవాదుల కింద ఏడాదికి లక్ష ఎకరాలకు మించి సాగునీరు అందడం లేదు.
సర్కారుకు పెరిగిన అంచనా వ్యయం పంపించాం!
పెరిగిన ధరలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేవాదుల స్కీం కు సంబంధించి పెరిగిన అంచనా వ్యయం వివరాలను సర్కారుకు పంపించాం. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పనులు చేస్తాం.
‒ సుధాకర్ రెడ్డి, సూపరిండెంట్ ఇంజినీర్, వరంగల్