29 ఏండ్లలో మొదటిసారి బీర్​ తయారీ కంపెనీ పరిశీలన

29 ఏండ్లలో మొదటిసారి బీర్​ తయారీ కంపెనీ పరిశీలన
  • యూబీ కేఎఫ్ కు వెళ్లిన 129 మంది ట్రైనీ ఎక్సైజ్‌ లేడీ కానిసేబుళ్లు
  • బీర్ తయారీ, ప్యాకింగ్‌, డిస్పాచ్​పై అవగాహన

హైదరాబాద్​సిటీ, వెలుగు: లేడీ ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు 29 ఏండ్ల కాలంలో మొదటిసారి బీర్, లిక్కర్ ​తయారీ విధానాన్ని పరిశీలించే అవకాశం వచ్చింది. జనవరి 31న ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్‌ సెకట్రరీ సయ్యద్‌ ముర్తజా రిజ్వీ, కమిషనర్‌ హరికిరణ్‌ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఎక్సైజ్‌ అకాడమీకి వెళ్లారు. అక్కడ శిక్షణ  పొందుతున్న లేడీ కానిస్టేబుళ్లతో మంత్రి జూపల్లి మాట్లాడారు. శిక్షణ సమయంలోనే బీర్, లిక్కర్​ కంపెనీలతోపాటు మద్యం డిపోలు పరిశీలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 శుక్రవారం అకాడమీ జేడీ శశిధర్‌రెడ్డి, అసిస్టెంట్​కమిషనర్‌ బేవరేజెస్‌ చంద్రయ్య 129 మంది ట్రైనీ ఎక్సైజ్‌ లేడీ కానిస్టేబుళ్లను మల్లేపల్లిలో ఉన్న యునైటేడ్‌ బేవరేజెస్‌ కింగ్ ఫిషర్ బీర్ కంపెనీకి తీసుకెళ్లారు. బీర్​బాటిళ్ల క్లీనింగ్, తయారీ, ప్యాకింగ్‌ విధానంపై అవగాహన కల్పించారు.  బీరు తయారీపై కంపెనీ సిబ్బంది పవర్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. శనివారం లిక్కర్​ కంపెనీ, మద్యం డిపోలను పరిశీలించనున్నారని శశిధర్‌రెడ్డి చెప్పారు.