- గ్రేటర్లో 13 హాట్‌స్పాట్లు
- అక్కడి నుంచే ఎక్కువగా కరోనా కేసులు
- కంటెయిన్మెంట్ జోన్లపై చర్యలు కరువు
- ప్రభుత్వం ఆదేశిస్తేనే చర్యలంటున్న అధికారులు
- ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే బాధితులు
- సీరియస్‌గా ఉంటే టిమ్స్, గాంధీకి తరలింపు
- కట్టడిని పట్టించుకోని బల్దియా, రెవెన్యూ
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 13 ప్రాంతాలు హాట్స్పాట్లుగా మారాయి. హాట్స్పాట్లను అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆయా ప్రాంతాల నుంచే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతాల్లో టెస్టులను పెంచడంతో పాటు హోం ఐసోలేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. హోం ఐసోలేషన్ సౌలతులు లేని వారిని టిమ్స్, గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కంటెయిన్మెంట్ జోన్లు, క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప చర్యలు తీసుకోలేమని అధికారులు చెబుతున్నారు. అయితే, సెకండ్‌వేవ్‌తో అప్రమత్తంగా ఉండాలని సర్కారు చెబుతున్నా.. కేసులు ఎక్కువగా నమోదవుతున్నా.. కంటెయిన్మెంట్ జోన్ల ఏర్పాటుపై మాత్రం సర్కారు చర్యలు తీసుకోవట్లేదు. నిరుడిలా హెల్త్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు కలిసి పనిచేస్తేనే ప్రస్తుతం కరోనాను కట్టడి చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు.
రోజూ 15 వేల టెస్టులు
గ్రేటర్ పరిధిలో అధికారులు రోజూ 15 వేల కరోనా టెస్టులు చేస్తున్నారు. యాంటీజెన్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చి లక్షణాలున్న వాళ్లకు మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. ఇక, ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో రోజూ 150 కేసులు వస్తుండగా.. నాలుగు రోజుల్లో 600కు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్నా జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖలు మాత్రం పట్టించుకోవట్లేదు. గతంలో కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ప్రజల్లోనే ఉన్న అధికారులు.. ఇప్పుడు మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనీసం శానిటైజేషన్ కూడా చేయట్లేదు. చెత్తనూ రోజుల తరబడి తీసుకెళ్లట్లేదు. కొన్ని చోట్ల ఎక్కడి చెత్తను అక్కడే తగలబెట్టేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అయినా కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జనం కోరుతున్నారు.
మార్కెట్ల నుంచే ఎక్కువగా..
రైతుబజార్లు, మార్కెట్లు ఉన్న ప్రాంతాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మార్కెట్లకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడమే కేసులు పెరగడానికి కారణమవుతోందని అంటున్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మలక్‌పేట్, ఎల్బీ నగర్, సంతోష్ నగర్, చింతల్‌బస్తీ ప్రాంతాల్లో మార్కెట్ల ద్వారానే కరోనా వ్యాప్తి ఎక్కువై ఉండొచ్చని భావిస్తున్నారు. తీర్థయాత్రలకు వెళ్లి వచ్చిన వారికీ కరోనా సోకినట్టు చెబుతున్నారు. గోల్కొండ, ఆఘాపుర, చార్మినార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కుటుంబంలోని ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా కరోనా సోకుతోందని అంటున్నారు. లక్షణాలున్నోళ్లు టెస్టులు చేయించుకోకపోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. హిమాయత్‌నగర్‌లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ మూతపడే టైంలో స్టూడెంట్లు కరోనా టెస్టులు చేయించుకని ఇండ్లకు వెళ్లారని, ఆ టైంలోనే కరోనా కేసులు పెరిగి ఉండొచ్చని అంటున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని కొన్ని చోట్ల పరిశ్రమలు, జీడిమెట్ల, చింతల్ తదితర ప్రాంతాల్లో మార్కెట్లు ఇరుగ్గా ఉన్నాయని, అక్కడి నుంచీ కేసులు ఎక్కువగా వస్తుండొచ్చని అంటున్నారు.
చర్యలు తీసుకుంటున్నం
కేసులు ఎక్కువ వస్తున్న ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నం. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హోం ఐసోలేషన్‌లో పెట్టి కిట్లు ఇస్తున్నం. టెస్టుల సంఖ్యను పెంచుతున్నం. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,500 టెస్టులు చేస్తున్నం. సెలవు రోజుల్లోనూ టెస్టులు చేస్తున్నం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బయటకు పోయేటప్పుడు మాస్కులు పెట్టుకోవాలి. సోషల్ డిస్టెన్స్‌ను పాటించాలి. పాజిటివ్ వచ్చినోళ్లు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కంట్రోల్ రూం, డయల్100కు సమాచారం ఇవ్వండి. కంటెయిన్మెంట్ జోన్ల ఏర్పాటుపై ఉన్నతాధికారులదే తుది నిర్ణయం.
- డాక్టర్ వెంకట్, డీఎంహెచ్‌వో, హైదరాబాద్ జిల్లా
సీరియస్ అయితే టిమ్స్, గాంధీకి
కరోనా పాజిటివ్ వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఏవైనా సమస్యలొస్తే.. వెంటనే టిమ్స్, గాంధీ ఆస్పత్రులకు పంపిస్తున్నం. టెస్టులు పెంచడంతో పాటు జనానికి అవగాహన కల్పిస్తున్నం. శేరిలింగంపల్లి లాంటి పెద్ద ఏరియాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి.
- డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో, రంగారెడ్డి జిల్లా
ఇవే హాట్‌స్పాట్లు
శేరిలింగంపల్లి, హిమాయత్‌నగర్, కూకట్పల్లి, చింతల్‌బస్తీ, గోల్కొండ, ఆఘాపుర, ఎల్బీ నగర్, చార్మినార్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, సంతోష్‌నగర్.