- ఏడుగురికి గాయాలు.. జల్గావ్ జిల్లాలో ఘటన
- మంటల భయంతో రైలు దిగితే ఢీకొన్న వేరే ట్రెయిన్
- ఓ బోగీలో పొగలు రావడంతో చైన్ లాగిన ప్యాసింజర్లు
- ఆ బోగీ నుంచి దిగి పక్క ట్రాక్ పైకి వెళ్లడంతో ప్రమాదం
జల్ గావ్: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. మంటలు అంటుకున్నాయన్న భయంతో ఓ రైలు నుంచి దిగిన ప్యాసింజర్లను మరో రైలు వచ్చి ఢీకొట్టింది. దీంతో 13 మంది మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. జల్గావ్ జిల్లాలోని మహేజీ, పార్ధేడ్ స్టేషన్ల మధ్య పచోరా టౌన్ వద్ద బుధవారం సాయంత్రం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ముందుగా లక్నో నుంచి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక జనరల్ బోగీలో పొగలు రావడంతో మంటలు అంటుకున్నాయని కొందరు ప్యాసింజర్లు ఎమర్జెన్సీ చైన్ లాగారు.
ట్రెయిన్ ఆగిన వెంటనే ఆ బోగీలోని ప్యాసింజర్లు ప్రాణభయంతో కిందకు దూకారు. వారిలో కొందరు పక్కనే ఉన్న మరో ట్రాక్ పైకి నిలబడి బోగీవైపు చూస్తూ ఉండిపోయారు. ఇదే సమయంలో ఆ ట్రాక్ మీదుగా బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న కర్నాటక ఎక్స్ ప్రెస్ వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో 12 మంది తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. కొందరి అవయవాలు తెగిపడి, మరికొందరు తీవ్రంగా గాయపడి మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ఏడుగురిని పచోరాలోని ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రుల్లో ఎవరికీ సీరియస్ గాయాలు కాలేదని, వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ప్రమాదం తర్వాత 15 నిమిషాలకు పుష్పక్ ఎక్స్ ప్రెస్, 20 నిమిషాలకు కర్నాటక ఎక్స్ ప్రెస్ తమ తదుపరి స్టేషన్లకు చేరుకున్నాయని చెప్పారు. ‘‘పుష్పక్ ఎక్స్ ప్రెస్ లోని ఓ జనరల్ బోగీలో నిప్పు రవ్వలు, పొగలు రావడంతో కొందరు చైన్ లాగారు. తర్వాత బోగీ నుంచి దిగిన ప్యాసింజర్లు పక్క ట్రాక్ మీదకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది” అని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే, బోగీకి మంటలు అంటుకోలేదని, రైలు చక్రాల మధ్య ఇరుసు లేదా బ్రేక్ బైండింగ్ వద్ద హీట్ కారణంగానే పొగలు వచ్చి ఉంటాయన్నారు.
మృతులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా..
రైలు ప్రమాదం ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుంటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. వరల్డ్ ఎకానమిక్ సదస్సు కోసం దావోస్ లో ఉన్న ఆయన వీడియో మెసేజ్ పంపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి గిరీశ్ మహాజన్, స్థానిక ఎస్పీ, కలెక్టర్ ఘటనా స్థలానికి బయలుదేరారని తెలిపారు. స్పాట్ కు వెంటనే ఎనిమిది అంబులెన్స్ లను, సిబ్బందిని పంపామన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.
గాయపడినవారికి ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి చికిత్స చేయిస్తుందన్నారు. కాగా, రైలు ప్రమాద మృతులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నానని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఈ యాక్సిడెంట్ పై స్పందించారు. రైల్వే బోర్డు చైర్మన్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించానని పేర్కొన్నారు.