- నేవీ స్పీడ్ బోట్ ఢీ కొట్టడంతో ప్రమాదం
- ప్రమాద సమయంలో లాంచీలో110 మంది, బోట్లో నలుగురు
- 97 మందిని రక్షించిన నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది
ముంబై : ముంబై తీరంలో జరిగిన ఘోర ప్రమాదంలో సముద్రంలో మునిగి 13 మంది మృతిచెందారు. ఇంజన్ ట్రయల్స్‌లో ఉన్న ఇండియన్ నేవీ స్పీడ్ బోట్ అదుపు తప్పి ప్యాసింజర్ లాంచీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది , 10 మంది టూరిస్టులు మరణించినట్లు నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం సాయంత్రం 4 గంటల టైమ్‌లో 110 మంది ప్రయాణికులతో నీల్కమల్ అనే లాంచీ తీరంలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు బయలుదేరింది.
తీరం నుంచి కొంతదూరం వెళ్లాక నేవీకి సంబంధించిన స్పీడ్ బోట్ ఒకటి వచ్చి లాంచీని ఢీకొట్టింది. దీంతో లాంచీ బ్యాలెన్స్ కోల్పోయి సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. వెంటనే స్పందించిన నేవీ, కోస్టు గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 11 నేవీ బోట్లు, 3 మెరైన్ పోలీసు పడవలు, ఒక కోస్టు గార్డ్ పడవ ద్వారా 97 మంది ప్రయాణికులను రక్షించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన మరో నలుగురి కోసం హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. రెస్క్యూ చర్యల్లో మెరైన్ పోలీసులు, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కార్మికులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
ట్రయల్స్ చేస్తున్న సమయంలో బోటు ఇంజిన్‌లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ప్రమాదం జరిగిందని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. లాంచీ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.