NCC: ఎన్సీసీ క్యాంప్ పేరుతో 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు

NCC: ఎన్సీసీ క్యాంప్ పేరుతో 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు

కోల్ కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు ఓవైపు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోన్న క్రమంలో తమిళనాడులో మరో దారుణం  జరిగింది. ఎన్ సీసీ క్యాంపు పేరుతో 13 మంది బాలికలపై లైంగింక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎన్ సీసీ ప్రిన్సిపాల్ తో పాటు కరస్పాండెంట్,ఇద్దరు ఉపాధ్యాయులు సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.   

 తమిళనాడులోని కృష్ణగిరిలో   నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి)   ఏర్పాటు చేస్తే  ఎన్ సీసీ యూనిట్ గా  గుర్తింపు వస్తుందని చెప్పి కొందరు  ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని ఒప్పించి అందులో  క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆగస్టు మొదటి వారంలో  జరిగిన   మూడు రోజుల ఎన్ సీసీ క్యాంపులో  17 మంది బాలికలు సహా 41 మంది విద్యార్థులు పాల్గొన్నారు.  ఇందులో  బాలికలకు స్కూల్ ఫస్ట్ ఫ్లోర్ లోని ఆడిటోరియంలో, బాలురకు గ్రౌండ్ ఫ్లోర్‌లో వసతి కల్పించారు. అయితే  క్యాంప్ ను  పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులను నియమించలేదు. తర్వాత  ఆడిటోరియం నుంచి బయటకు రప్పించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలికలు ఆరోపించారు.

 క్యాంప్ ముగిసిన తర్వాత విద్యార్థులు తమపై జరిగిన  లైంగిక వేధింపుల గురించి స్కూల్ టీచర్లకు, ప్రిన్సిపాల్ కు చెప్పారు.అయితే ఇంతటితో వదిలేయాలని ..బయట చెప్పొద్దని స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థులను హెచ్చరించారు.  పోలీసులకు  కూడా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు 11 మందిపై ఫోక్సో కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఎన్ సీసీ పేరుతో మిగతా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  బాలికలకు   జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ    వైద్య పరీక్షలు నిర్వహించింది.